సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు
మా హయాంలో కట్టిన ఇళ్లను మీరు కట్టినట్లు చెప్పుకుంటారా?
18 నెలల్లో ఒక్కరికి ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?
ఒక్కరికి ఒక్క ఇల్లు అయినా మంజూరు చేశారా? పైసా అయినా ఖర్చు చేశారా?
మా హయాంలో ఇంటి స్థలాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణంలో ఉన్న ఇళ్లను మీరే కట్టేశామంటారా?
ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు
మీ కథ, మీ స్క్రీన్‌ప్లే, మీ దర్శకత్వంలో నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది
మా హయాంలో 71,800 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్
21.75 లక్షల ఇళ్లు మంజూరు.. కోవిడ్ సంక్షోభం ఎదుర్కొని 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి
2023 అక్టోబర్ 12న ఒకే రోజు 7,43,396 ఇళ్లల్లో గృహ ప్రవేశాలతో చరిత్ర సృష్టించాం
మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లల్లో ఒక్కటి కూడా మీరు మంజూరు చేయలేదు
ఇవన్నీ మా హయాంలోనే పూర్తయ్యే దశలో, శ్లాబ్ లెవల్‌లో, శ్లాబ్ కింద స్థాయిలో ఉన్నవే
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో.. అప్పట్లోనే మంజూరై నిర్మాణంలో ఉన్న ఇళ్లను పట్టుకుని ‘ఈ ఇళ్లన్నీ మేమే కట్టేశాం’ అంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని.. నాటకాల రాయుడు అని అంటారని చురకలు వేశారు.
ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను తనదిగా చెప్పుకోవడంలో.. ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ సీఎం చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో క్రెడిట్ చోర్ బాబు హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
» చంద్రబాబు గారూ.. మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న ‘‘క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు.
గత ప్రభుత్వం.. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్‌సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకుని ‘‘ఇళ్లన్నీ మేమే కట్టేశాం’’ అంటున్నారు. కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గు పడకుండా పచ్చి అబద్ధాలను బల్లగుద్ది మరీ చెబుతూ ఆ క్రెడిట్ మాదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు.
» మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లల్లో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మీరు మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే.
» ఇవికాక 2023 అక్టోబర్ 12న ఒకేసారి 7,43,396 ఇళ్లల్లో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందే ఉన్నా అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం! మా హయాంలో 71,800 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి, కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేశాం.
» అయినా అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్‌ను కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం చంద్రబాబు గారూ! మేము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం.
మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం! ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి.


