
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రతీ ఆలోచనలోనూ కుట్రే ఉంటుందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. కుట్రలతోనే తన పర్యటనల్లో కావాలని ఉద్రిక్తతలు.. తన సెక్యూరిటీ తగ్గించారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు మాకు సహకరించలేదు.. జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, మీటింగ్‌లు పెట్టుకోవడం.. ఇవన్నీ హక్కులే కదా. మరి రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులు నలభై ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకి తెలీదా?. కుట్రలతోనే నా పర్యటనల్లో ఉద్రికత్తలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు మాకు సహకరించలేదు. నాకు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇవ్వడం లేదు. చంద్రబాబుకు నచ్చినప్పుడు సెక్యూరిటీ ఇస్తాడు.. ఇష్టం లేకపోతే సెక్యూరిటీ ఇవ్వడు అని తెలిపారు.
పెడనలో సభ పెట్టిన నేతలందరిపై కేసులు పెట్టారు. నా పర్యటనలు అయ్యాక తప్పుడు కేసులు పెడుతున్నారు. మిర్చి యార్డుకు వెళ్లి రైతులకు సంఘీభావం తెలపడం తప్పా?. పొగాకు రైతులకు సంఘీభావంగా వెళ్తే కేసులు పెట్టారు. మా పార్టీ కార్యకర్త కురుబ లింగయ్యను చంపి, మా పార్టీ నేత తోపుదుర్తిపై కేసు పెట్టారు. మా వాళ్లను మేం పరామర్శించినా కేసులు పెడుతున్నారు. మళ్లీ చంద్రబాబే దాన వీర కర్ణ సినిమా రేంజ్‌లో యాక్టింగ్ చేస్తున్నారు. చంద్రబాబు యాక్టింగ్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా దిగదుడుపే’ అని సెటైర్లు వేశారు.
