సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
ఉద్యోగార్థులను మోసం చేయటం దగా కాదా?
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం
కొత్త నోటిఫికేషన్‌తో పబ్లిసిటీ స్టంట్ చివరకు స్కామ్‌లతో ముగిసిన మీ నిర్వాకం
మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థి వివరాలు డేటా బేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?
సెలెక్టివ్ గా కొందరికి మాత్రమే మెసేజ్‌లు ఎందుకు పంపారు?
ఎంపికైన వారి జాబితా ఎందుకు ప్రదర్శించలేదు?
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రూ.15 లక్షలతో బేరాలా?
మీ పార్టీ నేతే ఈ డీల్స్ చేయటం వాస్తవం కాదా?
ఫేక్ సర్టీఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వటం నిజం కాదా?
ఇది రిక్రూట్‌మెంటా?.. లేక వేలం పాటా?
మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి
లోకేశ్‌ని మంత్రి పదవి నుంచి తప్పించాలి
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సర్కార్ నిర్వహించిన డీఎస్సీ–2025 పరీక్షలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆక్షేపించిన మాజీ సీఎం వైఎస్ జగన్, పేపర్ లీకులు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టుల మాయం వంటి ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్త నోటిఫికేషన్‌ను ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. నారా లోకేశ్‌ని మంత్రి పదవి నుంచి తప్పించి ... మెగా డీఎస్సీని స్కాంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సోమవారం సీఎం చంద్రబాబు సర్కార్ తీరును ఎండగడుతూ వైఎస్ జగన్ పోస్టు చేశారు.
చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా
⇒ డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. దీనికేమి సమాధానం చెబుతారు? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘డార్క్ ఆపరేషన్’ను ఎందుకు దాచిపెడుతున్నారు?.
పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్‌సీఈఆర్‌టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
⇒ రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టీఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి?
⇒ టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి? మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి.. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరాలి. చంద్రబాబూ..! మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలి.


