
సాక్షి,అమరావతి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భద్రత విషయంలో లోపభూయిష్టంగా వ్యవహరించిన విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకుంది. ఆయనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించింది.
తన భద్రతా కుదింపుపై జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ఉదయం వాదనలు జరగ్గా.. జగన్ భద్రత విషయంలో రాజీ పడొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే.. మధ్యాహ్నాం తిరిగి వాదనల సమయంలో అడ్వొకేట్ జనరల్ వివరణ ఇస్తూ.. ‘‘స్పేర్ పార్ట్స్ కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు. కాబట్టి ఆయన కోసం మరొక వాహనాన్ని ఏర్పాటు చేస్తాం. ఎక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంటుందో గుర్తించి.. అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తాం’’ అని పేర్కొన్నారు.
దీంతో రెండు వారాల్లో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించిన న్యాయస్థానం.. మూడు వారాల్లో పిటిషనర్‌ను కూడా రీజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అంతకు ముందు ఈ ఉదయం విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాన మంత్రులకు ముఖ్యమంత్రులకు ఏ విధమైన భద్రత కల్పిస్తారో అదే విధంగా మాజీ సీఎం అయిన జగన్‌కు భద్రత కల్పించేట్టు చూడాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారాయన.
‘‘వైఎస్ జగన్‌కు మంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వొచ్చు కదా.. ఎందుకు ఇవ్వడం లేదు. జామర్ ఏర్పాటుపై మధ్యాహ్నం లోపు స్పష్టత ఇవ్వాలి. భద్రతపై అధికారులతో మాట్లాడి వివరణ ఇవ్వాలి’’ అని అడ్వకేట్ జనరల్‌ను ఆయన ఆదేశించారు.