‘మీకు పెళ్లయిపోయింది..పోండి’

Youth Cheated Lover Gram Panchayat Forced Him To Marry Her - Sakshi

అనంతపురం: ప్రేమ పేరుతో ఓ బాలికలను యువకుడు వంచించగా, గ్రామ పెద్దలు పంచాయితీ చేశారు. ఆ బాలిక మెడలో పసుపుతాడు కట్టించారు. ఈ పెళ్లి తంతుకు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు దృష్టిసారించారు. వివరాల్లోకి వెళితే... ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమపేరుతో వంచించాడు. తరచూ బాలిక ఇంటివద్దకు వెళ్తుండటంతో బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ నెల 18న పంచాయితీ చేశారు. బాలిక ఇంటి ముందు యువకుడి చేత తూతూ మంత్రంగా పసుపుతాడు కట్టించారు. ‘‘మీకు పెళ్లయిపోయింది..పోండి’ అంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

స్పందించిన అధికారులు : బాలిక మెడలో పసుపుతాడు కడుతున్న యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి స్పందించారు. ఉరవకొండ రూరల్‌ సూపర్‌వైజర్‌ తిరుపాల్‌భాయిని ఆమిద్యాలకు పంపగా...ఆమె బాలికను విచారించారు. బాలికను చైల్డ్‌ హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్‌ మాట్లాడుతూ బాల్యవివాహలు చట్టరీత్యా నేరమని, 8వతరగతి చదివే బాలిక పెళ్లి చెల్లుబాటు కాదన్నారు. బాలికలను కేజీబీవీ పాఠశాలలో ఉంచి మేజర్‌ అయ్యే వరకూ చదివిస్తామన్నారు. మరోవైపు పోలీసులూ ఈ ఘటనపై స్పందించారు. బాలిక మెడలో పసుపుతాడు కట్టిన యువకుడితో పాటు అందుకు ప్రోత్సహించిన గ్రామపెద్దలను పోలీసు స్టేషన్‌కు పిలిపించినట్లు తెలుస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top