
తల్లిదండ్రులకు ఫోన్ చేసి, అనంతరం రైలుకింద పడి మృతిచెందిన బ్రహ్మారెడ్డి
హైదరాబాద్‌లో ఘటన.. మృతుడి స్వగ్రామం పెదగార్లపాడులో విషాదం
పల్నాడు జిల్లా: మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (25) బుధవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. శ్రీనివాస రెడ్డి, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా.. బీటెక్ పూర్తి చేసిన చిన్న కుమారుడు బ్రహ్మారెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మూడేళ్లుగా ప్రయతి్నస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు.
దీంతో బుధవారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉద్యోగం సాధించలేకపోయానని.. తానిక బతకలేనని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపి ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం హైదరాబాద్ లింగంపల్లి సమీపంలో రైలు కిందపడి బ్రహ్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతిచెందడంతో శ్రీనివాస్ రెడ్డి, భూలక్ష్మి బోరున విలపించారు. పోస్టుమార్టం పూర్తి కావడంతో బుధవారం రాత్రి బ్రహ్మారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన పెదగార్లపాడు తీసుకువచ్చారు.