
సాక్షి, అమరావతి: యోగా ప్రాముఖ్యత తెలిపేలా స్కూల్ సిలబస్‌లో ఒక పాఠం పెడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. స్కూళ్లు మొదలవగానే రోజూ గంటసేపు విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు.
యోగాపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన వలంటీర్లకు జూన్ 21న ప్రధాని సభలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. బుధవారం నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర–2025 నిర్వహిస్తామన్నారు.