డీఎస్సీలో అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ గుంటూరులో ర్యాలీ చేస్తున్న అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
మెగా డీఎస్సీ 2025లో తవ్వేకొద్దీ లీలలెన్నో.. ఉద్యోగాలు అంటూ ఊరించి అమ్ముకున్న బాబు సర్కారు
అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి సర్టీ ఫికెట్ల పరిశీలన కూడా పూర్తయ్యాక తీరా తుది జాబితాలో వారి పేర్లు గల్లంతు..
మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థులకు మెస్సేజ్‌లు
ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టీ ఫికెట్ల పరిశీలనకు పిలిచిన ప్రభుత్వం
కానీ అర్హులకు అటు ఉద్యోగం ఇవ్వకుండా.. ఇటు ‘రిజెక్టెడ్’లోనూ చూపకుండా ఆటలు
గ్రీవెన్స్‌లోనూ అభ్యర్థులకు తప్పుడు సమాధానమే..
వేల సంఖ్యలో మెగా డీఎస్సీ బాధితులు..
రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న టీచర్ అభ్యర్థులు, నిరుద్యోగులు
డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆందోళనలు
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
జిల్లా టాపర్ అయినా జాబు రాలేదు..
ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా ఆరు నెలలుగా ప్రభుత్వం స్పందించడం లేదు. – కె.అనిల్‌కుమార్, డీఎస్సీ బాధితుడు, శ్రీకాకుళం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025లో విస్తుగొలిపే వాస్తవాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నడుమ ఏళ్ల తరబడి శ్రమించి సాధించుకున్న అరుదైన అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాల రాసిందని కాల్ లెటర్లతో వెరిఫికేషన్‌కు సైతం హాజరై మోసపోయిన అర్హులైన అభ్యర్థులు మండిపడుతున్నారు. జిల్లాకు ఓ విధానం అమలు చేసి ‘హారిజాంటల్’ రిజర్వేషన్ అని పేరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పోస్టుకు ఒక్కరే అభ్యర్థిని (1:1 నిష్పత్తి) సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించిన తరువాత తీరా తుది జాబితాలో తమ పేర్లు గల్లంతు చేశారని అర్హులు వాపోతున్నారు.
ఒక పోస్టుకు ఒక్కరినే పిలిస్తే.. హాజరైన అభ్యర్థి సర్టిఫికెట్ల్లలో లోపం ఉంటే ఆ విషయం చెప్పి వారిని పక్కనబెడతారు. అనంతరం రెండో స్థానంలో ఉన్నవారికి అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఉద్యోగాలకు ఎంపికైన వారికే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాల్సిందిగా నిర్ణీత తేదీని ప్రకటించారు. అన్ని పత్రాల పరిశీలన పూర్తి చేసి అంతా సక్రమమేనంటూ ప్రకటించారు. కానీ తుది ఎంపిక జాబితాలో మాత్రం అర్హుల పేర్లు లేకుండా చేశారు. ప్రభుత్వ నిర్వాకానికి బలైన ప్రతిభ గల డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు.
మెరిట్‌లో ఉన్నారని ప్రకటించి మోసం..!
డీఎస్సీ ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి. కానీ డీఎస్సీ 2025లో మాత్రం ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం.. సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం.. తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులంతా మెరిట్ లిస్ట్‌ను పరిశీలించే వీలు లేకుండా చేశారని ఆక్రోశిస్తున్నారు. మెరిట్ లిస్టును ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలి.
కానీ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థులను ఒక పోస్టుకు ఒక్కరినే (1:1) ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మందిలో కేవలం 16,437 పోస్టులకు అంత మందికే కాల్ లెటర్లు పంపారు. కాల్ లెటర్లు పంపిన వారిని నిర్ణీత తేదీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని లేఖల్లో పేర్కొన్నారు. చెక్ లిస్టు సరి చూసుకున్న తర్వాత వారిని ‘ఓకే’ కూడా చేశారు. అయితే తిరస్కరణ జాబితాలో పేర్లు లేని, సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిన కొందరు అభ్యర్థుల పేర్లను తుది ఎంపిక జాబితాల్లో నుంచి తొలగించడం గమనార్హం.
గోడు పట్టించుకోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం..
తమ సర్టిఫికెట్లు అన్నీ సరిగా ఉన్నాయని ప్రకటించాక కూడా పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే... ఇందులో తమదేం లేదని, రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలని సలహా ఇచ్చారు. బాధితులంతా రాష్ట్ర కార్యాలయంలో సంప్రదిస్తే.. మళ్లీ డీఎస్సీకి ప్రయత్నించండని ఉచిత సలహా ఇచ్చి అవమానించారని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ డీఎస్సీలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ప్రకారం.. మెరిట్‌లో ఉండి, పోస్టు వస్తుందన్న వారికే కాల్ లెటర్లు పంపారు. వారికి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేశారు. చివరకు వారికి మొండిచెయ్యి చూపించారు. అర్హులు తమకు జరిగిన అన్యాయంపై విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక న్యాయ పోరాటానికి దిగారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలంటూ ఎం.ఏకాంబరానికి వచ్చిన కాల్ లెటర్
చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లికి చెందిన ఎం.ఏకాంబరం (బీసీ–డి) డీఎస్సీలో ఎస్‌ఏ సోషల్ స్టడీస్ విభాగంలో 125వ ర్యాంకు సాధించారు. జిల్లాలో బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉండగా ఆయన ఆరో అభ్యర్థి. ఆగస్టు 28న సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ అందింది. అన్ని పత్రాలు పరిశీలించి అధికారులు ధ్రువీకరించారు. కానీ సెలక్షన్ లిస్టులో అతడి పేరు లేదు. అంతకు ముందే పెట్టిన రిజెక్ట్ లిస్టులోనూ ఏకాంబరం పేరు లేదు. ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే.. ‘గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసుకోండి..’ అని డీఈవో సమాధానం ఇచ్చారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం టి.విజయలక్ష్మికి వచ్చిన కాల్ లెటర్
చిత్తూరు జిల్లా యాదమర్రికి చెందిన టి.విజయలక్ష్మి (ఓసీ) స్కూల్ అసిస్టెంట్ (ఇంగి్లష్) ఎస్జీటీలో 647వ ర్యాంకు వచ్చింది.ఆగస్టు 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆమెకు కాల్ లెటర్ పంపారు. వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కానీ ఫైనల్ ఎంపిక జాబితాలో మాత్రం పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేదు. దీనిపై డీఈవో కార్యాలయంలో సంప్రదించగా.. స్పోర్ట్సు కోటాలో మీ పోస్టు పోయిందని సమాధానం చెప్పారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే కటాఫ్ అంతకు ముందే అయిపోయిందని చెప్పారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలంటూ ఇ.శ్రీనివాసులుకు వచ్చిన కాల్ లెటర్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ఇ.శ్రీనివాసులు (బీసీ–డి) ఎస్జీటీలో 87వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని ఆయనకు కాల్ లెటర్ అందింది. అయితే 2,665 ర్యాంకు అభ్యర్థికి హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో పోస్టు ఇచ్చారు. దీనిపై శ్రీనివాసులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే 85 ర్యాంకుతో పూర్తయిందని మౌఖికంగా, 58వ ర్యాంకుతో పూర్తయిందని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో ఏది నిజం?
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వై.శ్రవణ్‌కు వచ్చిన కాల్ లెటర్
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడ నరసాపురానికి చెందిన వై.శ్రవణ్‌కుమార్(బీసీ–ఏ) ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్‌లో 52వ ర్యాంకు, బీసీ–ఏ కోటాలో 3వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ 10 రోజుల తర్వాత విడుదలైన లిస్టులో ఆయన పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులోనూ కనిపించలేదు. దీనిపై ఆర్జేడీ కార్యాలయంలో గ్రీవెన్స్‌కు దరఖాస్తు చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎస్.పృథ్వీరాజుకు వచ్చిన కాల్ లెటర్
నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి చెందిన ఎస్.పృథీ్వరాజ్ (బీసీ–బీ) టీజీటీ తెలుగు జోన్–2లో 157వ ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ 9న గుంటూరులో జరిగింది. కానీ 15న విడుదలైన సెలక్షన్ లిస్టులో ఆయన పేరు లేదు. దీనిపై విద్యాభవన్‌లోని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు స్పందన లేదు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం బండారు యమునకు వచ్చిన కాల్ లెటర్
విశాఖ జిల్లాకు చెందిన బండారు యమున (బీసీ–డీ మహిళ) ఫిజికల్ సైన్స్‌లో 68వ ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తనకు రావాల్సిన పోస్టును 311వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి ఇచ్చారని యమున ఆవేదన వ్యక్తం చేసింది. అంత పెద్ద ర్యాంకు వచ్చిన వారికి ఎలా ఇచ్చారని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే ‘స్పోర్ట్సు కోటా’లో ఇచ్చామని చెబుతున్నట్లు పేర్కొంది. జనరల్ విభాగంలో పరీక్ష రాసి 311వ ర్యాంకు పొందిన అభ్యర్థికి స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం ఇచ్చినట్లు చూపారు. మెగా డీఎస్సీలో ఇలాంటి విచిత్రాలు మరెన్నో!
⇒ వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లికి చెందిన షేక్ నసీమూన్ (బీసీ–ఈ) డీఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్‌లో 43వ ర్యాంకు సాధించింది. సెప్టెంబర్ 7న సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్ అందింది. అదే రోజు జిల్లా కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాగా అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించి పోస్టు ఓకే చేశారు. తీరా నాలుగు రోజుల అనంతరం విడుదలైన ఎంపిక జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో అధికారులను సంప్రదించగా.. ‘బై మిస్టేక్ వల్ల మీకు కాల్ లెటర్ అందింది..’ అంటూ చేతులు దులుపుకొన్నారు. జిల్లా కలెక్టర్, డీఈవో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు.
అలా ఎలా ఇచ్చేస్తారు?
డీఎస్సీ రాసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కూడా హాజరయ్యా. రిజెక్టెడ్, సెలెక్టెడ్ లిస్ట్‌లో నా పేరు లేదు. స్పోర్ట్స్ కోటాలో పోస్టు ఇచ్చినట్లు చెప్పారు. నాది 198వ ర్యాంక్ అయితే స్పోర్ట్స్ కోటా కింద పోస్ట్ ఇచ్చిన వ్యక్తి ర్యాంక్ 872. నాకు కాల్ లెటర్ ఇవ్వక ముందే స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. మరి నాకు ఇవ్వాల్సిన పోస్టు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చామని ఎలా చెబుతారు? – ఎస్.నూకరాజు, కాకినాడ
సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోరా?
మెరిట్‌లో ఉన్నవారికి పోస్ట్‌లు ఇవ్వాలని.. మెరిట్‌ను డీ మెరిట్ చేయవద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పోస్టులను ఇచ్చేశారు. ప్రతిభగల నాలాంటి వారికి అన్యాయం జరిగింది. ఓపెన్ కేటగిరిలో 30 పోస్ట్‌లు ఉన్నాయి. 87వ ర్యాంక్ వచ్చిన నాకు పోస్టు ఇవ్వలేదు. ప్రతిభను గుర్తించకపోతే ఎలా? – పి.ప్రతిభ, రాజమండ్రి
తీరని అన్యాయం..
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కొంతమందికి మాత్రమే వ్యక్తిగతంగా సందేశాలు పంపి పిలిచారు. రిజర్వేషన్ నిబంధనలను సక్రమంగా అమలు చేయలేదు. ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ మార్కులను పారదర్శకంగా ప్రకటించలేదు. ఒకే అభ్యర్థి అనేక పోస్టుల జాబితాల్లో కొనసాగడంతో పలువురు అర్హులు ఉద్యోగాలను కోల్పోయారు. అభ్యర్థులకు తీరని అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – దేవరకొండ వెంకట్రావు దర్శి, ప్రకాశం జిల్లా
నా ఉద్యోగం.. ఇతరులకు ఇచ్చారు
డీఎస్సీ 2025లో బయాలజీ సైన్స్ ఉర్దూ మీడియం పరీక్ష రాశా. 57.77 మార్కులు వచ్చాయి. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన నాకు ఎస్‌ఏ పోస్టు ఇవ్వాలి. నాకివ్వాల్సిన పోస్టును బీసీ–ఈ అభ్యర్థికి ఇచ్చారు. న్యాయం చేయాలని 8 నెలలుగా అధికారులకు, విద్యాశాఖ మంత్రికి, చివరకు సీఎంకు విన్నవించుకున్నా ఫలితం లేదు. –సయ్యద్ జమీల్, రాయచోటి, అన్నమయ్య జిల్లా


