కాకినాడ జిల్లా: పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్ నటుడు. మేకప్.. పేకప్ ఆయనకు బాగా పరిచయమైన పదాలు. అందుకేనేమో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అధికార యంత్రాంగం కూడా పైపై మేకప్పులకే పరిమితమై పట్టణ సుందరీకరణకు పేకప్ చెప్పడానికి సిద్ధమైంది! స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పిఠాపురం పట్టణ సుందరీకరణ పనులు ప్రారంభించారు. గోడలపై చిత్రాలు వేయడం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి సుందరంగా అలంకరించడం వంటి పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు.
ఇంతవరకు బాగానే ఉన్నా కాలం చెల్లిన భవనాలకు సైతం మాం...చి మేకప్ వేసి జనాలకు సినిమా చూపించాలనుకుంటున్నారు. మున్సిపల్ పార్కులో ఉన్న మస్తరు కార్యాలయం పూర్తిగా శిథిలమై తుప్పలు, డొంకలతో ప్రమాద స్థితిలో ఉంది. రేపో మాపో కూలి పోయే ఆ భవనానికి మరమ్మతులు చేయకుండా పగిలిపోయిన గోడలకే రంగులు వేసి బొమ్మ చూపిస్తున్నారు. ఇది చూసిన జనం ‘ఇదేనా సుందరీకరణ అంటే’ అని ముక్కున వేలేసుకుంటున్నారు!


