63వ జాతీయ రహదారిపై మండుటెండలో మహిళల రాస్తారోకో
ప్రభుత్వాన్ని ప్రశ్నించారంటూ వ్యక్తి అక్రమ అరెస్ట్!
పోలీసుస్టేషన్ ఎదుట గ్రామస్తుల బైఠాయింపు
మంత్రి పయ్యావుల తీరుపై మండిపాటు
విడపనకల్లు: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గమైన అనంతపురం జిల్లా ఉరవకొండలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. తాగునీరెందుకివ్వరని ఈ క్రమంలో ప్రశ్నించిన పాపానికి ప్రజలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామ బీసీ కాలనీ వాసులు బుధవారం తాగునీటి కోసం మండుటెండనూ లెక్క చేయకుండా 63వ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు.
చిన్నారులు, వృద్ధులు, మహిళలు, గర్భిణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు ఇరవై రోజులుగా బీసీ కాలనీకి తాగునీరు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్‌కు ప్రజల సమస్యలు పట్టడం లేదంటూ మండిపడ్డారు. విషయం తెలుసుకున్న విడపనకల్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన్, సిబ్బంది అక్కడకు చేరుకుని, ఆందోళనకారులను బలవంతంగా పీఎస్‌కు తరలించేందుకు యత్నించారు.
అయితే అందరూ మహిళలే కావడంతో అక్కడున్న చిన్న తిమ్మన్నను బలవంతంగా జీపు ఎక్కించి పీఎస్‌కు తరలించారు. నీటి కోసం ప్రశ్నిచినందుకే అరెస్ట్ చేస్తారా అంటూ గ్రామంలోని బీసీ కాలనీ వాసులంతా ఏకమై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గడేకల్లు నుంచి ట్రాక్టర్లపై విడపనకల్లు పీఎస్‌కు చేరుకున్నారు. తాగునీటి సమస్యపై ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అక్రమంగా అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
పోలీసులు ప్రజల కోసం పని చేయడం లేదని, టీడీపీ నేతల మెప్పు కోసమే వారు పనిచేస్తున్నారన్నారు. ‘మంత్రి గారూ.. తాగునీరు అడిగితే పోలీసులను ఊసిగొల్పుతారా?’ అంటూ మండిపడ్డారు. పోలీసుల అదుపులో ఉన్న చిన్న తిమ్మన్నను విడుదల చేయాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


