
సీఎం ఇలాకాలో మరోసారి కలకలం
శాంతిపురం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కర్లగట్ట పంచాయతీ తమ్మిగానిపల్లిలో సోమవారం ఒక మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమ్మిగానిపల్లె గ్రామానికి చెందిన మునెప్పకు ఇద్దరు భార్యలు. అనారోగ్యం బారినపడ్డ ఆయన ఈనెల 5న మృతి చెందాడు. మొదటి భార్య మునెమ్మకు కుమారుడు మంజున, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్య గంగమ్మకు కుమారుడు సురేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇరువురు భార్యల పిల్లల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో మునెప్ప రెండో భార్య గంగమ్మను విద్యుత్ స్తంభానికి కట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్ ఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. సురేషే తన తల్లి గంగమ్మను కరెంటు పోల్ వద్ద నిలబెట్టి, డ్రిప్పు పైపును చుట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని ఎస్‌ఐ ఒక ప్రకటనను విడుదల చేశారు.
