మురళి నా జీవితాన్ని నాశనం చేశాడు..! | woman rejects 15 lakh offer demands marriage | Sakshi
Sakshi News home page

మురళి నా జీవితాన్ని నాశనం చేశాడు..!

May 28 2026 1:22 PM | Updated on May 28 2026 1:28 PM

woman rejects 15 lakh offer demands marriage

నాలుగేళ్ల ప్రేమను విడదీసిన కులం 

పెద్దల పంచాయితీతో ముఖం చాటేసిన ప్రియుడు 

రూ.15లక్షలు ముట్టజెప్పేందుకు  ఒప్పందం

డబ్బు కాదు పెళ్లి చేయమంటున్న  యువతి  

కర్నూలు: మండల పరిధిలోని సూగూరు గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన కురువ మురళి నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రియుడి మాటలను నమ్మి శారీరకంగా ఒక్కటయ్యారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు. రెండు పర్యాయాలు గర్భం దాల్చగా మందు బిల్లలు వేయించి గర్భస్రావం చేయించినట్లు బాధితురాలు వాపోతోంది. ఎలాగో పెద్దలను ఒప్పిస్తాడని ఎంతో నమ్ముకుంది. 

చివరకు ప్రియుడు తమ ప్రేమను కాదనుకున్నాడు. మోజు తీరాక కులం అడ్డుపెట్టుకుని ఉడాయించాడు. దీంతో ఇటీవల ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. అప్పటికే ఇంటికి తాళాలు వేసుకుని ఉడాయించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మంత్రాలయం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడకు చేరుకోగానే కొందరు పెద్దలు బాధితులను ఏమార్చారు. బాధితురాలికి న్యాయం చేస్తామంటూ ఊరికి తీసుకొచ్చారు. 

వంచన విలువ రూ.15 లక్షలు 
ప్రేమ పెళ్లికి అక్షింతలు వేయాల్సిన పెద్దలు వంచనకు విలువ కడుతూ పంచాయితీ చేపట్టారు. రూ.15 లక్షలు ఇచ్చేందుకు రాజీ కుదిర్చారు. ఇప్పటికే ప్రియుడి కుటుంబ సభ్యులు రూ.4 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు వాటాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయిననూ బాధితురాలు తనను మోసగించిన మురళితోనే వివాహం చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. కాగా ప్రియుడు మురళి గ్రామానికి ఆరు నెలలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. 

బాధితురాలు ఒప్పుకుంటే మిగిలిన కాస్త బ్యాలెన్స్‌ చేతిలో పెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోనూ కొందరు అధికారులు అతి తెలివి ప్రదర్శించారు. బాధితురాలితో తనకు మురళితో ఎలాంటి సంబంధం లేదన్నట్లు సంతకాలు పెట్టించారు. బాధితురాలు తిరగబడకుండా పెద్దల సమక్షంలో సంకెళ్లు వేసుకునేలా చేయడం గమనార్హం. బలమైనా పోక్సో చట్టాలు ఉన్న నేపథ్యంలోనూ ఇలాంటి పంచాయితీలు చోటు చేసుకోవడం దారుణం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement