బుచ్చిరాజ్యంలో.. ఆదిపత్య పోరు

Widespread Publicity Social Media Over Tdp Resignation - Sakshi

 రాజమహేంద్రవరంలో కత్తులు దూస్తున్న ‘పచ్చ’ సామంతులు

 కోల్పోయిన రాజ్యం కోసం ఒకరు.. 

ఉన్నది కాపాడుకొనేందుకు మరొకరు

వందల ఏళ్ల చరిత్ర కలిగి.. రాజరాజనరేంద్రుడు ఏలిన పురాతన రాజమహేంద్రవరం నగరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సామంతులు ‘ఎత్తుల’ కత్తులు దూస్తున్నారు. ఒక సామంతుడు ‘బుచ్చి’రాజు. మరొకరు ‘ఆది’రాజు. రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరికపు వాసనలు వారిని వీడటం లేదు. బుచ్చిరాజును సైన్యంతో సహా పదేళ్ల క్రితమే పొరుగు రాజ్యానికి ఆదిరాజు తరిమేశారు. అప్పటి నుంచీ కోల్పోయిన రాజ్యంలో పట్టు సాధించాలనే ఆరాటంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా అలక పాన్పు ఎక్కేస్తున్నారు బుచ్చిరాజు. వందిమాగధులతో రకరకాల తంత్రాలు పన్నుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో రాజకీయ మాయోపాయాలు పన్ని, ఆదిరాజును ఇరుకున పెట్టి, రాజ్యంలో పట్టు సాధించాలన్నది ఆయన వ్యూహం.

సాక్షి,రాజమహేంద్రవరం: ఉత్తరాంధ్ర పరగణాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆజానుబాహుడైన ఓ నాయుడికి స్వయానా బంధువైన ఆదిరాజు ఏమైనా తక్కువ తిన్నారా? బుచ్చిరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన రాజ్యంలో వేలు పెడితే యుద్ధం తప్పదని వేగుల ద్వారా బుచ్చిరాజుకు సందేశం పంపించారు. అలనాడు దుర్యోధనుడు చెప్పినట్టు ‘‘సూది మొన మోపినంత స్థలం కూడా వదులుకోన’’ని స్పష్టంగా చెప్పాడు. విషయం ఆ నోటా ఈ నోటా రాజ్యం నలుమూలలా పాకడంతో సామంతులు, ఆంతరంగికుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. భటుల ద్వారా ఇది తెలుసుకున్న బుచ్చిరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

అలాగని వందిమాగధులతో యుద్ధానికి సై అని సాహసించడం లేదు. తన రాజ్యంలోని సైనిక సంపత్తి, మంత్రాంగం సరిపోదనే కారణంతో.. అలకబూని.. రాజప్రసాదం తలుపులు తెరవకుండా మూడు రోజులుగా అంతఃపురానికే పరిమితమైపోయారు. ఈ తరహా రాజకీయ తంత్రం బుచ్చిరాజుకు కొత్తేమీ కాదు. రాజమహేంద్రవర రాజ్యాన్ని కోల్పోయిన గాయం ఇంకా మానకున్నా.. ‘చంద్ర’వంశ రాజదర్బార్‌లో కనీస మర్యాద కూడా దక్కడం లేదని ఏడు పదుల వయస్సులో ఉన్న ఈ సామంతరాజు కుమిలిపోతున్నారు. గతంలో కూడా ఇలానే కనీసం వయస్సుకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ అంతఃపురంలో ఏకాంతంగా అంతర్మధనం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆంతరంగికులు గుసగుసలాడుకుంటున్నారు. 

దాదాపు పదేళ్లుగా అవమాన భారంతో రగిలిపోతున్న బుచ్చిరాజు కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన ఎత్తులు ఆదిరాజు రాజకీయ తంత్రం ముందు చిత్తవుతున్నాయి. భవిష్యత్‌లో రాజమహేంద్రవరంలోని 52 పరగణాలకు జరిగే పోరు కోసమే సామంతుల మధ్య ఇంతటి రాజ్యకాంక్ష నెలకొందనే చర్చ రాజదర్బారులో నడుస్తోంది. బుచ్చిరాజు రాజ్యంలోకి వచ్చే తొమ్మిది పరగణాలతో పాటు, మిగిలిన 43 పరగణాల్లో తన సుబేదారులకే పట్టు ఎక్కువ ఉండటంతో.. వారిని యుద్ధరంగంలోకి దింపాలనేది బుచ్చిరాజు వ్యూహం. అయినప్పటికీ ఆదిరాజు సిక్కో లు రాజుల బంధుత్వం దన్నుతో ధీమాగా ఉన్నారని ఆ రాజప్రసాదంలోని భటులు చెప్పుకొంటున్నారు. 

సామంతుల మధ్య సంధి కోసం ‘చంద్ర’వంశ రాజు పంపించిన దూతలు బుచ్చిరాజు అంతఃపురంలో గంటన్నర చర్చించినా చివరకు తలలు పట్టుకుని వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. పైకి మాత్రం సామంతుల మధ్య యుద్ధ వాతావరణం లేదని, బుచ్చిరాజుకు అసలు అసంతృప్తే లేదని చెప్పారు. ‘చంద్ర’వంశ సామంతులు నిమ్మకాయల చినరాజు, బెజవాడలో ‘గద్దె’నెక్కిన రామ్మోహనరాజు, రాజమహేంద్రవరం రాజ్యంలో గోదావరి అవతల ఒడ్డున ప్రజలకు చుక్కలు చూపించిన హర్రర్‌రాజు, అనపర్తి రెడ్డి రాజు వంటి దూతల సంధి విఫలమైంది.

అసలు సామంతుల మధ్య చిచ్చు పెట్టిందే ‘చంద్ర’వంశ రాజు. సంధి కోసం వెళ్లిన దూతలు మధ్యలో అంతఃపురం బయట చెప్పుకొన్న మాటలను రహస్యంగా విన్న రాజభటులు బుచ్చిరాజు చెవిన వేశారు. నాడు పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామ రాజ్యాన్నే కూల్చేసి, సింహాసనం అధిíÙ్ఠంచి, ఇన్నేళ్లవుతున్నా.. తన వ్యతిరేక కూటమితో చేతులు కలిపిన బుచ్చిరాజును ఒకప్పటి ‘చంద్ర’వంశ రాజు ఇప్పటికీ వదిలిపెట్టలేదని వేగుల ద్వారా వచ్చిన సమాచారం. అందుకే ఈ సంధి యత్నాలు ‘చంద్ర’వంశ అంతఃపురం సాక్షిగా రక్తి కట్టిస్తున్న ఎత్తుగడగా కనిపిస్తున్నాయి. చక్రవర్తిగా బుచ్చిరాజు చలామణీ అయ్యే రోజుల్లో అతడికి ఆదిరాజు సామంతుడు కావడమే విచిత్రం. సామంతుల మ«ధ్య చిచ్చు చివరకు ఏ తీరానికి చేరుతుందోనని ఇరుగు, పొరుగు రాజ్యాల్లోని నాయకులు, ప్రజలు కోటగోడలెక్కి మరీ ఆసక్తిగా చూస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top