
ఎగువన కురుస్తున్న వర్షాలతో పోటెత్తుతున్న వరద.. ఆల్మట్టి నుంచి జూరాల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం
ప్రస్తుతం 1.95 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
175 టీఎంసీలకు చేరిన నిల్వ
సాక్షి, హైదరాబాద్/శ్రీశైలం ప్రాజెక్ట్/హోళగుంద: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా దాటుకుంటూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన ఉన్న ప్రధాన ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర జలాశయాల గేట్లను ఇప్పటికే ఎత్తివేసి నీళ్లను కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు 1,20,149 క్యూసెక్కుల వరద ఉండగా, సాయంత్రం 7 గంటల నాటికి ఏకంగా 1,95,894 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయంలో నీటి మట్టం 877.4 అడుగులకు చేరగా, నిల్వలు 175.1 టీఎంసీలకు పెరిగాయి. విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 67,019 క్యూసెక్కులను దిగువన నాగార్జునసాగర్‌కి విడుదల చేస్తున్నారు.
మరో 40 టీఎంసీలు వస్తే..
శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే మరో 40 టీఎంసీలు అవసరం. అయితే వరద నిర్వహణలో భాగంగా జలాశయంలో నిల్వలు 200 టీఎంసీలకు చేరకముందే గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేయనున్నారు. వరద తీవ్రత మరింత పెరిగితే సోమవారమే గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
ఎగువ నుంచి స్థిరంగా వరద
ఎగువున ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.02 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ 91 టీఎంసీలను నిల్వ చేస్తూ విద్యుత్ ఉత్పత్తి, గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 99.9 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్ట నిల్వ సామర్థ్యం 37.64కు గానూ 30.85 టీఎంసీలను నిల్వ చేస్తూ వచి్చన వరదను వచి్చనట్టు విద్యుత్ ఉత్పత్తి, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. దానికి దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి 1.2 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గానూ 7.44 టీఎంసీలను నిల్వ చేస్తూ 1.24 లక్షల క్యూసెక్కులను గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదులుతున్నారు.

తగ్గని తుంగభద్ర జోరు
మరోవైపు కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 72 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. జూరాల, తుంగభద్ర నుంచి విడుదల చేస్తున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో జలాశయం వేగంగా నిండుతోంది. ఇక్కడ విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లు విడుదల చేస్తుండడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌లోనూ క్రమంగా నిల్వలు పెరుగుతున్నాయి. సాగర్‌కి 56.6 వేల క్యూసెక్కులు వస్తుండగా, నీటిమట్టం 524.1 అడుగులకు చేరింది.
సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వలు 156.86 టీఎంసీలకు చేరాయి. కాగా, ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో వచ్చే వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడంతో గోదావరి, ప్రాణహిత నదుల్లో ఇంకా వరదలు ప్రారంభం కాలేదు. శ్రీరాంసాగర్, కడెం, నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్ప ప్రవాహం మాత్రమే వస్తోంది.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఇంద్రావతి, శబరి ఉప నదుల్లో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్‌లోకి 11,13,750 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 1,65,714 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.