
576 అడుగులకు సాగర్ నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టులో రెండు గేట్ల ఎత్తివేత
నాగార్జునసాగర్/దోమలపెంట: సాగర్ జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి 576 అడుగులకు (271.6270 టీఎంసీలు) చేరింది. ఈ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు), ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా కూడా నీటిని సాగర్ జలాశయంలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 1,21,400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది.
సాగర్ జలాశయం నుంచి గడిచిన 24 గంటల్లో విద్యుదుత్పాదనతో 3,030 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కులు, కుడి కాల్వకు 234 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 3,205 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రివర్స్ పంపింగ్ ద్వారా 1,377 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయంలోకి ఎత్తిపోశారు. సాగర్ జలాశయంలోకి మరో 41 టీఎంసీల నీరు వచ్చి చేరితే.. 590 అడుగులకు చేరి నిండుకుండలా మారనుంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాలకు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోందని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. కాగా, శ్రీశైలం ఆనకట్ట వద్ద గురువారం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఆనకట్ట స్పిల్‌వే నుంచి 54,406 క్యూసెక్కులు, భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పతి చేస్తూ 31,328 క్యూసెక్కులు.. మొత్తం 66,648 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ఎగువనున్న జూరాలలో ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 20,530 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 37,465, సుంకేసుల నుంచి 43,790 క్యూసెక్కులు.. మొత్తం 1,01,785 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.1 అడుగుల వద్ద 205.2258 టీఎంసీల నీరు నిల్వ ఉంది.