మద్యం మానిపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. | Visakhapatnam Young Man Hulchul Alcohol Incident | Sakshi
Sakshi News home page

మద్యం మానిపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..

May 12 2026 11:02 AM | Updated on May 12 2026 11:03 AM

Visakhapatnam Young Man Hulchul Alcohol Incident

విశాఖపట్నం జిల్లా: మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తి, పునరావాస కేంద్రానికి తరలిస్తుండగా నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. బలవంతంగా మద్యం మానిపిస్తే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని అలజడి సృష్టించాడు. రిహాబిలిటేషన్‌ కేంద్రానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం పైనుంచి దిగిపోయి, ఆర్టీసీ బస్సు కింద పడుకుని నానా యాగీ చేశాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 

గోపాలపట్నం సమీపంలోని బాజీ జంక్షన్‌కు చెందిన భార్గవ్‌ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అతడికి మద్యం మానిపించేందుకు చినముషిడివాడలోని రిహాబిలిటేషన్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. అయితే సుజాతనగర్‌ బీఆర్‌టీఎస్‌ రహదారిపై ఒక్కసారిగా వాహనం దిగిపోయిన భార్గవ్‌.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేశాడు

. వెంటనే బస్సు కింద పడుకుని, తనను కేంద్రానికి తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు. దీంతో ప్రయాణికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్‌ నిర్వహించి, అతడికి మెరుగైన మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.  

Advertisement
 
Advertisement
Advertisement