వరద బాధితులకు అండగా..వలంటీర్ల సైన్యం | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు అండగా..వలంటీర్ల సైన్యం

Published Tue, Jul 19 2022 8:17 AM

Village And Ward Volunteers Help For Flood Relief Work - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, ఏలూరు/తాళ్లరేవు: గోదావరి వరద బాధితులకు వలంటీర్లు కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ చేయూతను బాధితుల చెంతకు చేరుస్తున్నారు. నడుం లోతు నీళ్లలోనూ ప్రాణాలకు తెగించి మరీ ముంపు గ్రామాల్లో బాధితులకు భోజనం, మంచినీటి టిన్నులు, నిత్యావసరాలు అందజేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వలంటీర్లు అలుపెరగని సేవలందిస్తున్నారు.

మూడురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. రెండు రోజులుగా ప్రభుత్వ సాయాన్ని బాధితులకు అందించడంలో వలంటీర్లు బాధ్యత తీసుకోవడంతో పంపిణీలో వేగం పెరిగింది. ఉదయాన్నే పాల ప్యాకెట్లు, అల్పాహారం, మంచినీటి టిన్నులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి వాటిని భుజాన వేసుకుని బాధితుల ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటకుండా భోజనం ప్యాకెట్లు అందజేస్తున్నారు. 

అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో వలంటీర్లు స్వయంగా వంట వండి వరద బాధితులకు వడ్డించారు. అయినవిల్లి మండలం పొట్టిలంకలో పాము శేషవేణి నడుం లోతు నీటిలో 20 లీటర్ల మంచినీటి టిన్నులను భుజానికెత్తుకుని వెళ్లి బాధిత కుటుంబాలకు అందచేసింది. ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు పంచాయతీ చింతావానిరేవులో రాత్రి 8గంటల సమయంలో వలంటీర్లు భోజనాలు వండి వడ్డించారు. ముంపు గ్రామాల్లో పడవలపై వెళ్లి సేవలందించారు.

తాళ్లరేవు మండలం పిల్లంక పంచాయతీ శివారు కొత్తలంకలో వలంటీర్‌ ఐతాబత్తుల గోపాలకృష్ణ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, అవసరమైన వారికి మందులు సరఫరా చేయడంతోపాటు దాతలు అందించే ఆహార పొట్లాలు, కాయగూరలు ప్రతి ఇంటికీ చేరవేస్తున్నాడు. గ్రామంలో 80 శాతానికిపైగా ఇళ్లు వరదలో చిక్కుకోవటంతో పీకల్లోతు నీటిలో ఈదుకుంటూ వెళ్లి ప్రతి ఇంటికీ నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 450 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. వీరికి మంగళవారం నుంచి మరో 150 మంది తోడవనున్నారు. ఆచంట, నర్సాపురం, యలమంచిలి మండలాల్లో వరద బాధితులకు వలంటీర్లు ప్రభుత్వ సాయాన్ని గంటల్లోనే అందిస్తున్నారు. బాధితులు వలంటీర్లను గుర్తించేలా ఏలూరు కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ విలేజ్‌ వలంటీర్‌ పేరుతో టీ షర్టులు సిద్ధం చేయించి పంపిణీ చేశారు.

సముద్రంలో సంభవించే ఆటు పోటులు వరదపై ప్రభావం చూపుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో 4 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గోదావరి నుంచి కొత్త నీటిని రాకుండా అడ్డుకున్నట్టుగా మారటంతో వరద నీరు వెనక్కి పొంగి గ్రామాలను ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రం పోటు తగ్గి.. ఆటు వచ్చి వెనక్కి వెళ్లిపోడవంతో వరద నీరు సముద్రంలో ఆటంకం లేకుండా సునాయాసంగా కలుస్తోంది. ఇప్పటివరకు పోటెత్తిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.  

వలంటీర్లను సత్కరిస్తాం
ముంపు మండలాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అధికారులకు పూర్తి సహాయకారులుగా ఉండటంతో ప్రజలకు ప్రభుత్వ సాయం త్వరితగతిన అందుతోంది. వలంటీర్ల సేవలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్వాతంత్య్ర దినోత్సవం రోజు వారిని సత్కరిస్తాం. 
– ప్రసన్నవెంకటేష్, కలెక్టర్, ఏలూరు జిల్లా

Advertisement
 
Advertisement
 
Advertisement