సాక్షి,తాడేపల్లి: చంద్రబాబుకు అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని వైఎస్సార్సీపీ నేత విడదల రజిని మండిపడ్డారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శనివారం రజిని మీడియా సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని కూడా గాలికి వదిలేశారన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 66లక్షల 35 వేల పెన్షన్లు అర్హులకు అందజేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రికార్డుస్థాయిలో అప్పులు చేస్తుందని ఆ నిధులను ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెచ్చిన అప్పులతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విలాసాలు చేస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ సరదాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీని గాలికి వదిలేసి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ జరుగుతోందని దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏకంగా అడుగుకు రూ.18,500 పైనే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీన్ని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు.
అమరావతిలో అద్దాలకే రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఆ వృథా డబ్బు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవన్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం అందేది స్కూళ్లు బాగుపడేవి కానీ చంద్రబాబుకు అమరావతి, అవినీతి తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఆరోగ్య శ్రీకి రూ.4 వేల కోట్ల బకాయి పెట్టారని.జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగిందని వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విడదల రజిని మండిపడ్డారు.


