ఏయూ శతాబ్ది వేడుకలకు గుర్తుగా కేంద్రం విడుదల చేసిన రూ.100 స్మారక నాణెం ఆవిష్కరిస్తున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సచిన్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు
విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి
పరిశోధన, అభివృద్ధి రంగంలో గ్లోబల్ సెంటర్‌గా ఏయూ అవతరించాలి
ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
ఒత్తిడిని జయించేందుకు ‘ప్రిపరేషన్’ ఒక్కటే మార్గం : సచిన్
యూనివర్సిటీల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు : గవర్నర్ జస్టిస్ నజీర్
ఏయూని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు రోడ్‌మ్యాప్ : సీఎం చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, అది భారతదేశపు ‘నాలెడ్జ్ పవర్ హౌస్’గా, విద్యావ్యవస్థకు లైట్‌హౌస్‌గా ఉందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభివరి్ణంచారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో సోమవారం నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, భారతరత్న, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. 1926లో సర్ సీఆర్‌రెడ్డి నాటిన విత్తనం నేడు మహా వృక్షమై సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో ప్రపంచ స్థాయికి ఎదిగిందని ప్రశంసించారు. నూతన జాతీయ విద్యా విధానం విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఏయూ వంటి సంస్థలు పరిశోధన, అభివృద్ధి రంగంలో గ్లోబల్ సెంటర్లుగా అవతరించాలన్నారు. యువత ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ఏయూ అగ్రస్థానంలో నిలవాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు.
స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్.. ఒక ఆయుధం: సచిన్
సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. తన 24 ఏళ్ల క్రికెట్ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను వివరిస్తూ, ఒత్తిడిని జయించేందుకు ‘ప్రిపరేషన్’ ఒక్కటే మార్గమన్నారు. విద్యార్థులు శ్రమను నమ్ముకోవాలని సూచించారు. తాను గత మ్యాచ్‌లలో ఎన్ని సెంచరీలు చేశాననేది ఎప్పుడూ ఆలోచించలేదని.. రేపటి బంతిని ఎలా ఎదుర్కోవాలన్నదే తన తపనని చెప్పారు. స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ అనేది జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి ఒక ఆయుధంలా పనిచేస్తుందన్నారు.
విద్యాలయాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు: గవర్నర్
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ ప్రాంగణాలను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని, ఇక్కడ కేవలం విజ్ఞాన చర్చలు, పరిశోధనలు మాత్రమే జరగాలని హితవు పలికారు. ఏయూ వంటి ప్రతిష్టాత్మక సంస్థ వందేళ్ల పండగను జరుపుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని చెప్పారు. నైతిక విలువలతో కూడిన విద్యా వ్యవస్థే దేశానికి వెన్నెముక అని గవర్నర్ స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏయూని ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దుతామని, అత్యాధునిక సౌకర్యాలకు పునాది వేస్తామని చెప్పారు.
ఏయూ స్టాంప్, నాణెం ఆవిష్కరణ..
ఏయూ శతాబ్ది వేడుకలకు గుర్తుగా కేంద్రం విడుదల చేసిన రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌లతో పాటు కాఫీబుక్‌ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సచిన్, గవర్నర్, చంద్రబాబు ఆవిష్కరించారు. అదేవిధంగా.. విద్యార్థుల హాస్టల్స్ సహా తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తున్న 10 మంది పూర్వ విద్యార్థులకు ఎక్స్‌లెన్స్ అవార్డుల్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఏయూ వీసీ ప్రొ.రాజశేఖర్ పాల్గొన్నారు. మరోవైపు.. కార్యక్రమం మొత్తం పూర్తయ్యే వరకూ విద్యార్థులను బయటకు పంపకపోవడంతో వారు అసహనం వ్యక్తంచేశారు.
ఆదిత్యుని సన్నిధిలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
అరసవిల్లి: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అంతకుమ ఉందు ఆయన శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథస్వామి దర్శనం కూడా చేసుకున్నారు. ఆదిత్యుని ఆలయాన్ని దర్శించుకున్న తొలి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గుర్తింపు పొందారు.
తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి
తిరుమల: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
జీవితాన్ని ఆనందంగా గడపడమే నిజమైన విద్య
ఏయూ ప్రాంగణం విశాలమైతే.. అక్కడ పుట్టే ఆలోచనలు ఇంకా విశాలంగా ఉంటాయి. వర్సిటీ అనేది విభిన్న ఆలోచనల సంగమం. పదిమందితో చర్చించుకున్నప్పుడే గెలుపు దిశగా తీసుకెళ్లే ఆలోచనలు పుడతాయి. అలవాటైనదే గొప్పదని భావించకుండా కొత్త దారులను అన్వేíÙంచాలి. ముఖ్యంగా ‘ఫిజిక్స్’ కంటే ‘సాహిత్యం’ నన్ను నేను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సాయపడింది. మార్కులు, ర్యాంకులనే లక్ష్యంగా పెట్టుకుని ఒత్తిడిలో బతుకుతున్న విద్యార్థులు.. జీవితాన్ని ఆనందంగా గడపడం నేర్చుకోవాలి. – త్రివిక్రమ్ శ్రీనివాస్,ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత


