
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాల కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. బుడమేరు కారణంగా విజయవాడ జల దిగ్భందమైంది. ఈ నేపథ్యంలో బుడమేరు, వరదల గురించి వెలగలేరు డీఈ మాధవ్ సంచలన కామెంట్స్ చేశారు.
తాజాగా డీఈ మాధవ్ సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘బుడమేరు వరద మానవ తప్పిదమే. ఫ్లడ్ వస్తుందని మాకు ముందే తెలుసు. శనివారం మధ్యాహ్నమే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాం. గేట్లు తెరవాల్సి వస్తుందని అధికారులకు సమాచారం ఇచ్చాం. 45వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గేట్లు ఎత్తుతాం.. నీళ్లు వదులుతున్నాం అని కూడా చెప్పాం’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు విజయవాడ వరదలపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. ఈ వరదలు కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వచ్చినవేనని అన్నారు. ఇది ప్రకృతి విపత్తు కాదు. మానవ తప్పిదమే దీనికి కారణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఉంటే ప్రమాదం తప్పేదని చెప్పారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు ఇలా చేశారని మండిపడ్డారు. విజయవాడ ప్రజలను ఇంతటి ఇబ్బందులకు గురిచేసి, 32 మంది ప్రాణాలను బలితీసుకున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.