ఏడాదిలో కొత్తగా 14 స్టార్టప్‌లకు యూనికార్న్‌ హోదా | Sakshi
Sakshi News home page

ఏడాదిలో కొత్తగా 14 స్టార్టప్‌లకు యూనికార్న్‌ హోదా

Published Fri, Apr 21 2023 5:14 AM

Unicorn status for 14 new startups in the year - Sakshi

సాక్షి, అమరావతి: యూనికార్న్‌ స్టార్టప్‌లు వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాది కాలంలో కొత్తగా 14 స్టార్టప్‌లు యూనికార్న్‌ హోదాను దక్కించుకున్నాయి. మొత్తం 68 యూనికార్న్‌లతో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన స్టార్టప్‌ కంపెనీ వ్యాపార విలువ 1 బిలియన్‌ డాలర్లు (రూ.­8,200 కోట్లు) దాటితే ఆ సంస్థలను యూనికార్న్‌లుగా పిలుస్తారు.

2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 68 స్టార్టప్‌లకు ఈ హోదా దక్కినట్లు హూరన్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ – 2023 వెల్లడించింది. ఇందులో అత్యధికంగా బైజూస్‌ 22 బిలియన్‌ డాలర్ల (రూ.1,80,400 కోట్లు)తో మొదటి స్థానంలో నిలిచింది.  డ్రీమ్‌ 11, స్విగ్గీలు 8 బిలియన్‌ డాలర్ల (రూ.65,600 కోట్ల)తో తర్వాతి స్థా­నాల్లో ఉంటే, ఓలా, రాజోర్‌పేలు 7.5 బిలియన్‌ డాలర్లు (రూ. 61,500 కోట్లు)తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

కానీ భారత సంతతికి చెందిన వారు ఏర్పాటు చేసిన యూనికార్న్‌ స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా 138 వరకు ఉన్న­ట్లు హూరన్‌ పేర్కొంది. భారతీయులు దేశంలోకంటే బయటి దేశాల్లో 70కి పైగా యూనికార్న్‌లను కలిగి ఉన్నట్లు హూరన్‌ పేర్కొంది. ఇండియాలో అత్యధికంగా యూనికార్న్‌లు బెంగళూరు, ముంబై నగరాల్లో ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా 33, ముంబై కేంద్రంగా 13 ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్‌ల విలువ రూ.352.6 లక్షల కోట్లు 
ప్రపంచవ్యాప్తంగా 1,361 యూనికార్న్‌లు ఉన్నట్లు హూరన్‌ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే కొత్తగా 303 స్టార్టప్‌లు యూనికార్న్‌ హోదాను దక్కించుకున్నట్లు తెలిపింది. మొత్తం యూనికార్న్‌ల వ్యాపార విలువ గతేడాదితో పోలిస్తే 17 శాతం పెరిగి రూ.352.6 లక్షల కోట్లు  (4.3 ట్రిలియన్‌ డాలర్లు) దాటినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా అమెరికాలో 666 యూనికార్న్‌లు ఉండగా, 316 సంస్థలతో చైనా రెండో స్థానంలో ఉంది.

నగరాల ప్రకారం చూస్తే శాన్‌ఫ్రాన్సిస్కో 181 యూనికార్న్‌లతో మొదటి స్థానంలో నిలిస్తే, న్యూయార్క్‌ 126, బీజింగ్‌ 79, షాంఘై 66 యూనికార్న్‌లతో తర్వాతి స్థానాల్లో  ఉన్నాయి. ప్రస్తుతం 500 మిలియన్‌ డాలర్ల విలువకు (వీటిని గాజెల్స్‌ అంటారు) చేరుకొని వచ్చే మూడేళ్లలో బిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకోవడం ద్వారా యూనికార్న్‌ హోదా పొందే సంస్థలు అత్యధికంగా బెంగళూరు కేంద్రంగా ఉన్నాయని తెలిపింది. గాజెల్స్‌ యూనికార్న్‌లుగా ఎదిగే నగరాల్లో బెంగళూరు ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది.

Advertisement
Advertisement