ఆరోగ్యానికి ‘ఆసరా’!

Two Years Completed For YSR Arogya Asara Scheme - Sakshi

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభించి నేటికి రెండేళ్లు 

రెండేళ్లలో 6.91 లక్షల మందికి రూ.454 కోట్ల మేర లబ్ధి

సాక్షి, అమరావతి: పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులు శస్త్ర చికిత్సలు చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ కుటుంబాన్ని అనేక ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. రోజు గడవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితులను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ గుర్తించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న పేద, మధ్య తరగతి వ్యక్తులకు విశ్రాంతి సమయంలో అండగా నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని 2019 డిసెంబర్‌ 2న ప్రారంభించారు. పథకం కింద శస్త్ర చికిత్సల అనంతరం వైద్యులు సూచించే విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా 5వేలు ప్రభుత్వం సాయం చేస్తోంది. ఈ పథకం ప్రవేశపెట్టి నేటికి రెండేళ్లు అవుతోంది.  

6.91 లక్షల మందికి ఆసరా 
పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి గత నెల 25వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా శస్త్ర చికిత్సలు చేయించుకున్న 6,91,805 మందికి ప్రభుత్వం రూ.453.96 కోట్లు అందించింది. ఆర్థిక సంవత్సరాల వారీగా పరిశీలించినట్లయితే 2019–20లో 1,07,233 మందికి రూ.79.54 కోట్లు, 2020–21లో 2,77,567 మందికి రూ.194.47 కోట్లు, 2021–22లో 3,07,805 మందికి రూ.180.21 కోట్లు సాయం అందింది.

సకాలంలో సాయం అందింది
నా భర్త సురేష్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంటారు. మా రెండేళ్ల పాప గుండె సమస్యతో బాధపడుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఇటీవల విశాఖలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేసి డిశ్చార్జ్‌ చేశారు. పాప విశ్రాంతి సమయానికి ఆసరా నగదు రూ.9,500 అందింది. మమ్మల్ని కుటుంబసభ్యుల్లా భావించి ఆరోగ్య మిత్రలు పనిచేశారు. ఉచితంగా ఆపరేషన్‌లు చేసి, ఆర్థిక సాయం చేయడం ఎంతో తోడ్పాటును అందిస్తోంది. లేదంటే పాపకు పౌష్టికాహారం, ఇతర సౌకర్యాల కోసం మేము అప్పు చేయాల్సి ఉండేది. 
– యర్రబోలు విశాల్, విశాఖపట్నం

డిశ్చార్జి అయిన రోజునే సాయం 
ఈ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రభుత్వం ఆరోగ్య ఆసరా కింద సాయం చేస్తోంది. శస్త్ర చికిత్సల అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి ఆర్థిక సాయం చేస్తున్నాం. రోగి డిశ్చార్జి అయిన రోజునే బ్యాంక్‌ ఖాతాలో ఆసరా సాయం జమ చేస్తున్నాం. 
– వినయ్‌ చంద్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కేర్‌ సీఈవో  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top