
గుంటూరు: వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పిడుగుపాటు గురై ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు ఇటికంపాడు రోడ్డు శివారులోని పోలేరమ్మ గుడి వద్ద పొలంలో పనిచేస్తున్న మహిళలపై బుధవారం(అక్టోబర్ 22వ తేదీ) పిడుగు పడింది. దాంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని మరియమ్మ(45), షేక్ ముజాహిద (45)లుగా గుర్తించారు.
వాయుగుండం ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్’, మరికొన్ని జిల్లాలకు ‘ఎల్లో’ ఎలర్ట్‌లను జారీ చేసింది. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. క్రమంగా నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. తర్వాత 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. ఇది తుపానుగా బలపడే అవకాశముందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర, శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని కొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.

పిడుగులతో కూడిన వర్షాలు
రానున్న5రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు,ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపారు.దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.