రూ.2,700 కోట్ల స్థలంపై గురి.. క్యాంపు ‘భరతం’ పట్టేస్తా..! | Two key public representatives eye on Kurnool B and C camp quarters | Sakshi
Sakshi News home page

రూ.2,700 కోట్ల స్థలంపై గురి.. క్యాంపు ‘భరతం’ పట్టేస్తా..!

Sep 13 2025 4:37 AM | Updated on Sep 13 2025 4:38 AM

Two key public representatives eye on Kurnool B and C camp quarters

చుట్టూ కాంక్రీట్‌ కట్టడాల నడుమ ఆకుపచ్చగా కనిపిస్తున్న ప్రాంతమే కర్నూలులోని బీ, సీ క్యాంపు క్వార్టర్స్‌

కర్నూలు బీ, సీ క్యాంపు క్వార్టర్స్‌పై ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల కన్ను

మిని క్రికెట్‌ స్టేడియం, లీజు పేరుతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేసే కుట్ర

70 ఏళ్ల కిందట నిర్మించిన క్వార్టర్లు కూల్చేయాలని కూటమి సర్కారు ఆదేశాలు

క్వార్టర్లను ఖాళీ చేయాలని ఉద్యోగులు, ఇతరులకు నోటీసులు

నీళ్లు, విద్యుత్తు సరఫరా నిలిపివేసిన అధికారులు.. వంద ఏళ్ల నాటి భారీ వృక్షాలతో చిన్నపాటి అరణ్యాన్ని తలపించేలా బీ, సీ క్యాంపులు

వాటిని నరికేస్తే ప్రాణవాయువు కోసం నగరం ఉక్కిరిబిక్కిరే.. 90 ఎకరాల్లో ఉన్న ఈ భూముల విలువ ఏకంగా రూ.2,700 కోట్లు

టీడీపీ జిల్లా కార్యాలయం కోసం ‘బీ’ క్యాంపులో రూ.120 కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలం!

చుట్టూ కాంక్రీట్‌ కట్టడాల నడుమ ఫొటోలో ఆకుపచ్చగా కనిపిస్తున్న ఈ ప్రాంతం కర్నూలులోని బీ, సీ క్యాంపు క్వార్టర్స్‌. కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు అధికారులు నివాసం ఉండేందుకు ప్రభుత్వం ఏ, బీ, సీ క్వార్టర్లను నిర్మించింది. బీ, సీ క్యాంపు క్వార్టర్స్‌లో దాదాపు వంద ఏళ్ల నాటి భారీ వృక్షాలు ఉన్నాయి. కిక్కిరిసిన నగరానికి ప్రాణ వాయువు అందించడంలో వీటి పాత్ర చాలా కీలకం. కర్నూలులోనే అత్యధికంగా చెట్లు ఉన్న ఈ ప్రాంతం కూడా ఇదే. అక్కడకు వెళితే ఆ చల్లదనానికి మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాంటి భారీ వృక్షాలను ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. 

బీ, సీ క్వార్టర్లను కూలగొట్టి టీడీపీ జిల్లా కార్యాలయానికి స్థలంతోపాటు మినీ క్రికెట్‌ స్టేడియం, మల్టీప్లెక్స్, స్టార్‌ హోటల్స్, ఫంక్షన్‌హాల్స్, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు కీలక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో చకచకా మంత్రాంగం జరుగుతోంది. దాదాపు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపు క్వార్టర్స్‌ విలువ దాదాపు రూ.2,700 కోట్లు! కర్నూలు చరిత్రలోనే దీన్ని అతి పెద్ద దోపిడీగా అభివర్ణిస్తున్నారు. బీ, సీ క్యాంపు స్థలాలను ఖాళీ చేయాలని అందులో ఉంటున్న వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన అధికారులు తాజాగా నీరు, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.

సాక్షి ప్రతినిధి కర్నూలు: భాషా ప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. 1953 అక్టోబర్‌ 1 నుంచి 1956 అక్టోబరు 31 వరకూ కర్నూలే రాజధాని. అప్పట్లో అధికారులు నివాసం ఉండేందుకు ఏ, బీ, సీ క్వార్ట­ర్లను నాటి ప్రభుత్వం నిర్మించింది. నగరంలో ఆ ప్రాంతాలను ఇప్పటికీ ఏ, బీ, సీ క్యాంపు అని వ్యవ­హరి­స్తుంటారు. మొత్తం 1,090 క్వార్టర్లలో ప్రస్తుతం 953 ఉన్నాయి. ఇందులో 367 క్వార్టర్లలో అధికారికంగా కొందరు, 490 క్వార్టర్లలో అనధికారికంగా మరికొందరు నివాసం ఉంటున్నారు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. ఇక్కడ సెంటు రూ.30 లక్షలకుపైగా ఉంది. 

ప్రధాన రహదారి ప్రాంతంలోనైతే రూ.50 లక్షలుపైనే ఉంది. సగటున రూ.30 లక్షలు అనుకున్నా ఎకరా రూ.30 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 90 ఎకరాల విలువ రూ.2,700 కోట్లపైనే! నగర నడిబొడ్డున అత్యంత విలువైన ఈ ప్రాంతంలో 70 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిని తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని, అపార్ట్‌మెంట్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆలోచించారు. ఆయన హఠాన్మరణంతో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు.   

సర్కారు ఖరీదైన స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధుల కన్ను 
బీ, సీ క్యాంపులోని క్వార్టర్లను తొలగించి మినీ క్రికెట్‌ స్టేడియం నిర్మించాలని మంత్రి టీజీ భరత్‌ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తక్కిన స్థలాలను లీజు పేరుతో కూటమి నేతలు గుప్పిట పట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం పేరుతో 33 ఏళ్లు లీజుకు తీసుకుని మల్టీప్లెక్స్, స్టార్‌ హోటల్స్, ఫంక్షన్‌హాల్స్, షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలుత 39 క్వార్టర్లను కూల్చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు అందులో నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు. అనంతరం మిగతావారికి జారీ అయ్యాయి. 

కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఈ స్థలం కర్నూలు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. తొలగించిన స్థలంలో 3–5 ఎకరాల్లో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి మిగతా 85–87 ఎకరాల స్థలాన్ని లీజు పేరుతో 33 ఏళ్లు దక్కించుకునేలా సిద్ధమయ్యారు. ఆ తర్వాత కూడా లీజుదారుడు కొనసాగాలని భావిస్తే మరో రెండు దఫాలు అంటే 66 ఏళ్లు వారి ఆదీనంలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే లీజు పేరుతో 99 ఏళ్లు వారి ఆజమాయిషిలోనే ఉంటుంది. కర్నూలులో అత్యంత విలువైన స్థలం ఇదే కావడం గమనార్హం! 

స్టేడియం కోసం ఇప్పటికే స్థలం సేకరించిన బీసీసీఐ.. 
కర్నూలులో భారీ క్రికెట్‌ స్టేడియం నిర్మాణం కోసం బీసీ­సీఐ ఇప్పటికే నేషనల్‌ హైవే సమీపంలో బాలసా­యి స్కూలు పక్కన 16.40 ఎకరాలను సేకరించింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించే వీలు­ం­ది. హైదరాబాద్‌–బెంగళూరు హైవే పక్కనే ఉన్నందున ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తలెత్తవు. ఈ స్థలం ఉన్నప్పటికీ మళ్లీ మినీ క్రికెట్‌ స్టేడియం పేరుతో నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంపై కూటమి ప్రజాప్రతినిధులు కన్నేయడం గమనార్హం! రెండు నెలలు గడువిద్దామన్నా.. క్వార్టర్లు ఖాళీ చేయించేందుకు కీలక ప్రజాప్రతినిధి ఐదు ప్రభుత్వ శాఖలను పురమాయించారు. 

పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్తు, ఆర్‌ అండ్‌ బీ అధికారులను రంగంలోకి దించారు. ఈ నెల 8వతేదీ నుంచి అధికారులు నీరు, కరెంట్‌ సరఫరా నిలిపివేశారు. పండుగ వేళ తామంతా ఎక్కడికి వెళ్లాలి? పిల్లల చదువులు ఏం కావాలి? ఉన్నఫళంగా కరెంటు, నీరు ఆపేస్తే తాము ఏం చేయాలని అందులో ఉంటున్న కుటుంబాలు అవస్థ పడుతున్నాయి. ఆర్‌అండ్‌బీ, కలెక్టరేట్, ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మూడు రోజులుగా ఆందోళనకు దిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రెండు నెలలు గడువిద్దామని కీలక ప్రజాప్రతినిధికి అధికారులు సర్దిచెప్పే యత్నం చేసినా వినలేదని చర్చించుకుంటున్నారు. 

రూ.120 కోట్ల స్థలంలో టీడీపీ కార్యాలయం!
టీడీపీ జిల్లా కార్యాలయం కోసం రెండెకరాలు 99 ఏళ్ల పాటు లీజుకివ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కలెక్టర్‌ రంజిత్‌­బాషాకు లేఖకు రాశారు. కర్నూలులో ‘బీ’ క్యాంపు మెయిన్‌ రోడ్డులోని ఖరీదైన స్థలాన్ని టీడీపీ కోరింది. ఇక్కడ సెంటు రూ.60 లక్షలు వరకు ఉంది. ఈ లెక్కన టీడీపీ కోరుతున్న రెండు ఎకరాల విలువ రూ.120 కోట్లకుపైనే ఉంటుంది!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement