నేడు గుంటూరు జిల్లాలో అమూల్‌ పాలసేకరణ ప్రారంభం 

Today Start Of Amul Milk Collection In Guntur District - Sakshi

వర్చువల్‌గా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మొదటిదశలో జిల్లాలో 129 గ్రామాల ఎంపిక  

831 బీఎంసీయూలకు ప్రతిపాదనలు

ఇప్పటికే 15,328 మంది మహిళా రైతుల నమోదు  

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. జిల్లాలో 831 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ (బీఎంసీయూ)ల ద్వారా పాలు సేకరించి పాల నాణ్యత, వెన్న శాతం ఆధారంగా లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకు రైతులకు అదనపు ఆదాయం లభించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలివిడతగా 18 మండలాల్లో 129 గ్రామాలను ఎంపికచేశారు. ఈ గ్రామాలను 12 రూట్‌లుగా విభజించారు. ఈ గ్రామాలను 115 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి పాలసేకరణ ప్రారంభిస్తున్నారు.

2,320 మంది గ్రామ వలంటీర్లు గ్రామాల్లో సర్వేచేసి 15,328 మంది మహిళా రైతులకు 20,686 పాడి ఆవులు ఉన్నట్లు గుర్తించారు. పాడి రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు. మహిళా కో ఆపరేటివ్‌ సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా ప్రస్తుతానికి 697 బల్క్‌ మిషన్‌ సెంటర్లకు స్థలాలను గుర్తించారు. 130 ఆటోమేటిక్‌ పాలసేకరణ యూనిట్‌లు ఏర్పాటు చేసి పాలు సేకరించనున్నారు. జిల్లాలోని 6 గ్రామాలకు చెందిన మహిళా రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడతారని గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 14 గ్రామాల్లో మహిళా  రైతులు చూసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

మొదట 47 గ్రామాల్లో  
జిల్లాలో మొదట 47 గ్రామాలను 5 రూట్‌లుగా విభజించి పాలు సేకరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. మిగిలిన గ్రామాల్లో దశలవారీగా పాలసేకరణ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి 6 గ్రామాల్లోని మహిళా రైతులతో వర్చువల్‌గా మాట్లాడతారు. యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెం, నాదెండ్ల మండలం చిరుమామిళ్ల, గొరిజవోలు, చందవరం,  నరసరావుపేట మండలం రంగారెడ్డిపాలెం, శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామాల్లోని వారితో ముఖ్యమంత్రి మాట్లాడతారు.
చదవండి:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! మే 31న ఉద్యోగ క్యాలెండర్‌   
104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top