
మార్గదర్శకాలతో ఉత్తర్వులు, షెడ్యూల్ విడుదల
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విద్యా శాఖ
తొలిసారి ‘టీచర్స్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ –2025’ ప్రకారం స్థాన చలనం
తొలుత హెచ్‌ఎంలు, తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు
జూన్ 11 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్ర పాఠశాల విద్యా శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఆన్‌లైన్ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. వివిధ విభాగాల టీచర్ల బదిలీ షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు మొత్తం ప్రక్రియను వచ్చే నెల 11వ తేదీ నాటికి పూర్తి చేయాలని విద్యా శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతకు ముందు 2023 జూన్‌లో టీచర్ల బదిలీలు జరిగాయి. రెండేళ్ల తర్వాత మొదటిసారి ‘టీచర్స్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ –2025’ ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలు చేపడుతున్నారు.
ఇకపై ఏటా మే నెలలో క్రమం తప్పకుండా ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక పాఠశాలలో ఒక సంవత్సరం 9 నెలలు (మొత్తం 21 నెలలు) సర్వీసు దాటిన ఉపాధ్యాయులంతా ఏటా జరిగే బదిలీలకు అర్హులవుతారు. ఐదు అకడమిక్ సంవత్సరాలు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు పూర్తయిన మిగతా టీచర్లను ఖచ్చితంగా బదిలీ చేస్తారు. ఒకవేళ వీరిలో ఎవరైనా దరఖాస్తు చేయకుంటే, మొత్తం బదిలీ పక్రియ పూర్తయ్యాక మిగిలిన ఖాళీల్లోకి వీరిని పంపిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మొత్తం బదిలీల ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://cse.ap.gov.in ద్వారానే కొనసాగుతుందని వెల్లడించింది. బదిలీలు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్య పాఠశాలలకు జరుగుతాయి. బదిలీల చట్టం–2025లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఉపాధ్యాయుల ఎన్‌టైటిల్ పాయింట్లు గుణించి సీనియారిటీ జాబితా తయారు చేస్తారు. వీరిలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకు వచ్చే వారికి తొలి ప్రాధాన్యతతో బదిలీకి అవకాశం కల్పిస్తారు. ప్రస్తుత బదిలీల్లో దరఖాస్తు నుంచి బదిలీ ఆర్డర్ వరకు అన్ని ప్రక్రియలూ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి.
ఫిర్యాదులు కూడా ఆన్‌లైన్ గ్రీవెన్స్ ద్వారానే స్వీకరిస్తారు. కమిషనరేట్ వెబ్‌సైట్ https://cse.ap.gov.in లో అభ్యర్థి తన లాగిన్‌తో బదిలీ కోరుకునే పాఠశాలల జాబితా ఎంచుకోవాలి. బదిలీ ఉత్తర్వులు పొందిన 3 రోజుల్లోగా ఆయా కమిటీలకు ఫిర్యాదు చేయాలి, వీటిని 15 రోజుల్లో పరిష్కారించాలి. కాగా, ఉపాధ్యాయ బదిలీల నిర్వహణలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.
ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ ఇలా..
1. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రధానోపాధ్యాయులకు మే 22 వరకు
స్కూల్ అసిస్టెంట్లకు ఈనెల 24
ఎస్జీటీలకు ఈనెల 27వ తేదీ
2. ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాల ప్రకటన
ప్రధానోపాధ్యాయులకు మే 24
స్కూల్ అసిస్టెంట్లకు మే 26, 27
ఎస్జీటీలకు మే 31
3. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
ప్రధానోపాధ్యాయులకు మే 25
స్కూల్ అసిస్టెంట్లు మే 28
ఎస్జీటీలకు మే 28 నుంచి జూన్ 1 వరకు
4. ఫైనల్ సీనియార్టీ జాబితా, ఖాళీల ప్రదర్శన
ప్రధానోపాధ్యాయులకు మే 27
స్కూల్ అసిస్టెంట్లకు మే 31
ఎస్జీటీలకు జూన్ 6
5. బదిలీల ఆప్షన్స్
హెచ్‌ఎంలకు మే 28
స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 1, 2
ఎస్జీటీలకు జూన్ 7–10
6. బదిలీ ఉత్తర్వుల విడుదల
హెచ్‌ఎంలకు మే 30
స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 4
ఎస్జీటీలకు జూన్ 11
7. పదోన్నతులు
» స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 2 హెచ్‌ఎంగా మే 30న వెబ్ ఆప్షన్స్, పదోన్నతి పొందిన ఉత్తర్వులు మే 31 విడుదల
» ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా జూన్ 6న వెబ్ ఆప్షన్స్, జూన్ 7న పదోన్నతి ఉత్తర్వులు జారీ