 
													తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నిగ్గుతేల్చాలన్న వైవీ సుబ్బారెడ్డిపై సర్కారు దుష్ప్రచారం
ఇటీవల ఈ కేసులో చిన్నప్పన్న అనే చిరుద్యోగిని అరెస్టుచేసిన సిట్.. రిమాండ్‌కు తరలింపు
2018కి ముందే సుబ్బారెడ్డి పీఏగా పనిమానేసిన చిన్నప్పన్న..
నిజానికి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దగ్గర కూడా పనిచేసిన చిన్నప్పన్న
అతన్ని అడ్డుపెట్టుకొని వైవీ సుబ్బారెడ్డిపై తప్పుడు ఆరోపణలు
నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనే ఆరోపణలపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిందే వైవీ సుబ్బారెడ్డి
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన అత్యున్నత న్యాయస్థానం
అయినా మారని చంద్రబాబు ప్రభుత్వ తీరు
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాల్లో చీవాట్లు, అక్షింతలతో అభాసుపాలైన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరో కట్టు కథ సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నిజాలు నిగ్గుతేల్చాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై బురద జల్లేందుకు దుష్ప్రచారానికి దిగుతోంది.
ఇందులో భాగంగా.. గతంలో సుబ్బారెడ్డి దగ్గర ఎప్పుడో పీఏగా పనిచేసిన చిన్నప్పన్న అనే చిరుద్యోగిని సిట్ అరెస్టుచేసింది. ఇతన్ని పావుగా వాడుకుని బాబు రూపొందించిన కట్టుకథ ఆధారంగా సుబ్బారెడ్డిపై సిట్ తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు చిన్నప్పన్న ఆంధ్ర భవన్‌లో చిరుద్యోగి అంటూ.. మరోవైపు అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ పరస్పర విరుద్ధ వాదనలు వినిపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
చిన్నప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి కూడా పీఏగా..
2018కి ముందు సుబ్బారెడ్డి దగ్గర పనిచేసి మానేశాడు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో ఉద్యోగిగా చేరిన చిన్నప్పన్న ఏకంగా టీటీడీలోని ప్రొక్యూర్‌మెంట్ జీఎం స్థాయి అధికారులను సైతం ప్రభావితం చేశాడని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. 
చిన్నప్పన్న బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకున్న ఆస్తులు వంటి ఇతర అంశాలకు ముడిపెట్టి సుబ్బారెడ్డిని ఎలాగైనా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని చూస్తే ఇది పక్కా కుట్ర కథేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి.. ఇదే చిన్నప్పన్న ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దగ్గర కూడా గతంలో పీఏగా పనిచేశాడు.
‘సుప్రీం’ చెప్పినా మారని బాబు తీరు..
తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని వినియోగించారంటూ చేసిన ఆరోపణలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం మండిపడింది. విచారణ సందర్భంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేలా బాబు వ్యాఖ్యలున్నాయని ఆక్షేపించింది. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని కూడా హితవు పలికింది. 
సర్వోన్నత న్యాయస్థానమే బాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. వాస్తవానికి.. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని అప్పటి టీటీడీ ఈఓ శ్యామలరావు సైతం మీడియా సమావేశంలోనే కుండబద్ధలు కొట్టారు.
డెయిరీల నుంచి వచ్చిన నెయ్యికి పరీక్షలు నిర్వహించి, నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని తేలిన రెండు ట్యాంకర్ల నెయ్యిని తిరిగి వెనక్కు పంపేశామని అప్పట్లో ఆయన తేల్చిచెప్పారు. ఇంత సుస్పష్టంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడనే లేదని తేలినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బాబు పక్కా ప్రణాళికతో తాజా కుట్రకు తెరలేపారు.
టీడీపీ ఆఫీసులో ఎన్‌డీడీబీ రిపోర్ట్ విడుదల..
ఇక గతేడాది సెప్టెంబరు 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే అంటే సెప్టెంబరు 19న టీడీపీ ఆఫీసులో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. నిజానికి.. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో విడుదల చేశారు. 
అనంతరం.. సెప్టెంబరు 20న టీటీడీ ఈఓ మీడియా ముందుకొచ్చి ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యతలేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబరు 22న మళ్లీ ఈఓ మాట్లాడుతూ.. తాను స్వయంగా సంతకంచేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చానని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు. తమకు ఎన్‌డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు.
ఈఓ ఎంతో గోప్యమని చెప్పిన ఎన్‌డీడీబీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడే బాబు రాజకీయ కుట్రలకు రోడ్‌మ్యాప్ వేశారని అందరూ ఊహించారు. ఇప్పుడు తాజాగా చిన్నప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ పిఏ అంటూ పదేపదే సుబ్బారెడ్డిపై దుష్ప్రచారానికి చంద్రబాబు సర్కారు, ఎల్లో మీడియా తెరలేపాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
