నాకు కోపం వస్తే.. ఎవరికైనా చెంప పగులుద్ది | TDP MLA Faces Heat Over Dictatorial Style Politics And Assault Allegations In Kavali, More Details Inside | Sakshi
Sakshi News home page

నాకు కోపం వస్తే.. ఎవరికైనా చెంప పగులుద్ది

May 28 2026 9:19 AM | Updated on May 28 2026 1:31 PM

TDP MLA Faces Allegations of Dictatorial Rule in Kavali

కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నియంత పాలనకు తెర తీశాడు. ఈ మాట సాక్షాత్తు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు బహిరంగ సభలోనే అంటూ ఎమ్మెల్యే తీరును ఆక్షేపించారు. కాలం కలిసొచ్చి శాసన సభ్యుడైన ఆయన పాలన గాలికి వదిలేశారు. సొంత రాజ్యాంగంతో కక్షల రాజకీయం నెరుపుతూ తరచూ వివాదాస్పదమవుతున్నారు. జర్నలిస్టుల నుంచి.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలనే కాకుండా తన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పోరాడిన సొంత పార్టీ నేతలపైనే కేసులు కట్టించి వేధించిన చరిత్రను మూటగట్టుకున్నారు. తాజాగా తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని గట్టిగా అడగడమే నేరంగా సొంత పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టారు.

సాక్షి నెల్లూరు: రాజకీయాలకు, శాసనసభలకు వన్నె తెచ్చిన ఎందరో ఉద్దండ పాలకులు ఏలిన కావలిలో ప్రస్తుతం డిక్టేటర్‌ పాలన సాగుతోంది. ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమవుతోంది. సామాన్య కుటుంబ స్థాయి నుంచి రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆయన మండల స్థాయి నేతగా ఉంటూ గత ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో టీడీపీ టికెట్‌ దక్కించుకున్నారు. అడ్డదారిలో అధికారం దక్కడంతో కన్ను మిన్ను కానక అరాచక పాలనకు తెర తీశారు. ఆయన మాటే శాననంగా సాగించే క్రమంలో నిరంకుశత్వ ధోరణితో వ్యవహరిస్తూ చెలరేగిపోతున్నారు.  

అక్రమ కేసులు, అరెస్ట్‌లే పాలనగా.. 
ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి రెండేళ్లుగా పాలన గాలికి వదిలేసిన.. అక్రమ కేసులు, అరెస్ట్‌లు, విధ్వంసాలు, అరాచకాలే ప్రామాణికంగా సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి  గ్రావెల్, మట్టి తవ్వకాల్లో మునిగిపోయారు. ఆయన అక్రమాలను ప్రశ్నించిన నలుగురు జర్నలిస్టులతోపాటు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యనేతలపై విధ్వంసం కేసును మోపారు. జర్నలిస్టులను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టించి తన నియంతృత్వాన్ని ప్రదర్శించారు.

 వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులతో దౌర్జన్య కాండను సృష్టించారు. రుద్రకోట వద్ద గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను వీడియోలు, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను ఆయన మనుషులు ఓ ఇంట్లో నిర్బంధించి కొట్టి బెదిరించే స్థాయికి వెళ్లారు. ఎమ్మెల్యే పాలనా వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియా పోస్టులను ఫార్వర్డ్‌ చేసిన జర్నలిస్టులపైనా కేసులు కట్టించారు. వైఎస్సార్‌సీపీ నేతలపైన అయితే లెక్కలేనన్ని కేసులు పెట్టించారు. బోగోలు మండలం కోళ్లదిన్నెకు చెందిన వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే వారిపై కేసులు కట్టకుండా బాధితులపైనే కేసు నమోదు చేయించారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ఏకంగా ఆస్పత్రిలోకి వెళ్లి మరోసారి టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. అయినా టీడీపీ నేతలపై కేసుల్లేవు.

మనీ స్కామ్‌లోనూ వాటాలపై ఆరోపణలు 
ముసునూరు కేంద్రంగా రూ.వందల కోట్ల మనీస్కామ్‌లో ఎమ్మెల్యేకు వాటాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధపడిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిని సైతం తన స్థాయిని మరిచి అసభ్యపదజాలంతో మీడియా ముఖంగా దూషణలకు దిగడంతోపాటు ఓ రేంజ్‌లో రెచ్చిపోవడం రాజకీయంగా కావ్య కృష్ణారెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు.   

సొంత పార్టీ నేతలపైనా అరాచకం 
నియోజకవర్గంలో సొంత పార్టీలో తనకు పోటీ ఉండకూడదని తన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన మాలేపాటి సుబ్బానాయుడు, ముసునూరుకు చెందిన శ్రీహరినాయుడు వంటి కీలక నేతలపై కేసులు కట్టించారు. సొంత పారీ్టలో వర్గ విభేదాలు సృష్టించి వర్గ రాజకీయాలకు మరింత ఆజ్యం పోశాడన్న ఆరోపణలున్నాయి. ఆది నుంచి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్న కావ్య ఎన్నికల సమయంలోనే టీడీపీ సీనియర్‌ నేత మన్నవ రవిచంద్రను అడ్డం వస్తే గొడ్డలితో నరికేస్తానంటూ బెదిరించిన ఘటన అప్పట్లోనే సంచలనం సృష్టించింది.

 కావలి సీటు ఇప్పించేందుకు సహకరించి ఎమ్మెల్యే విజయానికి సహకరించిన బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధపడ్డాడు. ఆయన అనుచర వర్గాన్ని టార్గెట్‌ చేసి వారికి చుక్కలు చూపించాడు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ జెండా మోసి డబ్బు సంచుల తూకంలో వెనకబడి సీటు త్యాగం చేసిన మాలేపాటి సుబ్బానాయుడు ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేసి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడన్న సంగతి తెలిసిందే. మాలేపాటిపై అక్రమ కేసులు నమోదు చేసి అధిష్టానం వద్ద చీవాట్లు తిన్నట్లు ప్రచారంలో ఉంది. 

మానసికంగా వేధింపులతో చివరకు మాలేపాటి ప్రాణాలు కోల్పోవడంతో ఎమ్మెల్యేపై సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో పాటు ఆయన్ను అడ్డుకున్న విషయం తెలిసిందే. ముసునూరు చెందిన శ్రీహరినాయుడు ఓ సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన సమయంలో బూతులు తిట్టినట్లుగా ఆయన స్వయంగా మాలేపాటి సంతాపసభలో చెప్పుకున్న సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన్ను పార్టీ దూరంగా పెట్టింది. కావలి పెత్తనాన్ని బీద చేతుల్లో పెట్టింది.

సీఎం చీవాట్లు పెడచెవిన
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరు రాష్ట్ర స్థాయిలో ఆయనకు 107వ స్థానం ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు చీవాట్లు పెట్టారు. వారం క్రితం కావలికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు పార్టీ కేడర్‌ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మూడు శాఖల పనితీరు ఆధ్వానంగా ఉంటే.. కావలి నియోజకవర్గంలో 11 శాఖల పనితీరు దారుణంగా ఉందని, ఇదేనా నీ పనితీరు అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఫెయిల్‌ అంటూ తలంటిపోశారు. ఓ పదిమందితో రాజకీయం చేస్తున్నావంటూ, ఇది మంచి పరిణామం కాదని, పార్టీలో  అందరిని కలుపుకుపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. 

సీఎం హెచ్చరించి ఐదు రోజులు గడవక ముందే.. మంచినీళ్లు అందించండంటూ కావలి మండలం చలంచర్ల పంచాయతీకి చెందిన కిషోర్‌ అనే టీడీపీ కార్యకర్త తన గ్రామస్తులతో వెళ్లి ఎమ్మెల్యేకు మొర పెట్టుకుంటే.. చెంపలు వాయించడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్‌టాపిక్‌ చర్చగా నడుస్తోంది. పార్టీ కేడర్‌ను కలుపుకుని పోవాలని ఆదేశిస్తే.. చెంపలు పగులగొట్టి కొత్త వివాదానికి తెరతీయడంపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement