వృద్ధురాలి రేకుల షెడ్డును జేసీబీలతో కూలదోస్తున్న టీడీపీ గూండాలు
తీవ్ర ఉద్రిక్తత
రోడ్డుపై బైఠాయించిన బాధితులు
ఈడ్చిపడేసిన టీడీపీ గూండాలు
జర్నలిస్టుల ముసుగులో టీడీపీ గూండాలు ఆక్రమిస్తున్నారన్న వైఎస్సార్‌సీపీ
సాక్షి టాస్క్ ఫోర్స్: తిరుపతి నగర నడిబొడ్డులోని ఎర్రమిట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భూమిలోకి టీడీపీ గూండాలు ప్రవేశించారు. దౌర్జన్యంగా జేసీబీలతో చదును చేసి గందరగోళం సృష్టించారు. మహిళలు, స్థానికుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్ మండలం, అక్కారంపల్లి సర్వే నం.101/3లో రూ.కోట్ల విలువచేసే 1.05 ఎకరరాల భూమి ఉంది. ఈ భూమి తమదేనని వృద్ధురాలు తులశమ్మ, మరి కొందరు కొంత కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏడాది క్రితం కొందరు యత్నించి విఫలమయ్యారు.
అసలే ఆదివారం, కోర్టులకూ సెలవులు ఉండడంతో పథకం ప్రకారం ఆ భూమిలో ఉదయం రెండు జేసీబీలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ వృద్ధురాలు తులశమ్మ నిరి్మంచుకున్న రేకుల షెడ్డును, దాని చుట్టూ ఉన్న చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో తులశమ్మ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత సమయానికి మరికొందరు మహిళలు అక్కడికి చేరుకుని జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు పథకం ప్రకారం అక్కడే ఉన్న టీడీపీ గూండాలు మహిళలను అడ్డుకోవడం ఇబ్బంది అవుతుందని భావించి.. టీడీపీ సానుభూతి పరులైన కొందరు మహిళలను పిలిపించారు.
ఎంతకూ పనులు ఆపకపోవడంతో బాధిత మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మరి కొందరు జేసీబీలకు అడ్డుపడ్డారు. తిరుపతి ఎర్రమిట్టలో టీడీపీ దౌర్జన్యంపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టుల ముసుగులో టీడీపీ చేస్తున్న భూ కబ్జా అని మండిపడ్డారు. తిరుపతి నగరంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులతో కలిసి సీపీఐ నేతలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు.


