పేదలపై బాబు సర్కారు కక్ష! | TDP Govt Cancels House Sites Allocated During Jagan Rule: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పేదలపై బాబు సర్కారు కక్ష!

May 1 2026 4:54 AM | Updated on May 1 2026 4:54 AM

TDP Govt Cancels House Sites Allocated During Jagan Rule: Andhra pradesh

ఆర్‌–5 జోన్‌లో పేదల ఇళ్లకు శంకుస్థాపన సందర్భంగా పైలాన్‌ ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ (ఫైల్‌)

రాజధానిలో వారికి చోటేలేదని కేబినెట్‌ సాక్షిగా స్పష్టికరణ 

వైఎస్‌ జగన్‌ ఇచ్చిన 50 వేల ఇళ్ల స్థలాలు రద్దు  

సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సరికొత్త భాష్యం 

చంద్రబాబు సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం

సాక్షి, అమరావతి: సామాజిక సమతూకం.. స్థానికులకు ప్రాధాన్యం.. మహిళా సాధికారత.. పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ రాజధాని అమరావతిలో పేదలకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఇళ్ల స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేసింది. తద్వారా పేదలకు రాజధానిలో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పింది. రాజధాని అంటే కొంత మందికి మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పేదలకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకునేందుకు గురువారం కేబినెట్‌ పచ్చ జెండా ఊపింది. పేదలకు కేటాయించిన భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్‌డీఏకి అప్పగించాలని నిర్ణయించింది.

ఆర్‌ఎఫ్‌–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఓ వైపు పేదల గూటి కలలను కూల్చి వేస్తూ.. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణం కోసం మాత్రం కారుచౌకగా భూ కేటాయింపులు చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతం కేవలం బడా బాబులకే సొంతమనే రీతిలో వ్యవహరిస్తూ పేదలను గెంటేసేలా నిర్ణయం తీసుకుంటున్నారనేందుకు సర్కారు తాజా నిర్ణయమే తార్కాణమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

ప్రత్యామ్నాయంగా కనీసం వారికి ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారో కూడా చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని సర్కారు సరికొత్త భాష్యం చెప్పడం దారుణమంటున్నారు. రాజధాని సహా రాష్ట్రంలో ఎక్కడా పేదలకు ఒక్క గజం కూడా భూమి ఇవ్వని చంద్రబాబు.. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేయడం గమనార్హం. రాజధానిలో బడుగు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 900 ఎకరాలతో ఆర్‌–5 జోన్‌ను ఏర్పాటు చేసింది. అందులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది. దానిని భారీ లేవుట్‌గా అభివృద్ధి చేశారు.  

రికార్డు స్థాయిలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు 
అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చింది. సంపద సృష్టిస్తూ.. విలువైన ఆస్తిని మహిళల చేతికి అందించింది. పేదల ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 78 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. ఏకంగా 17 వేలకుపైగా కాలనీలు రూపుదిద్దుకున్నాయి. 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి వందల ఇళ్ల నిర్మాణంతో ఆయా చోట్ల కొత్త గ్రామాలే ఆవిష్కృతమయ్యాయి. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో పేదలకు సైతం చోటు ఉండాలని, సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్‌ 5 జోన్‌ను ప్రకటిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏమాత్రం గిట్టని చంద్రబాబు సర్కారు పేదలపై కక్ష కట్టి తన తీరును మరోమారు చాటుకుంది. సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement