భూకుంభకోణం: టీడీపీ నేతలకు సుప్రీం నోటీసులు

Supreme Court Notice To TDP Leaders In Amaravati Land Scam - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి భూకుంభకోణంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సిట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టు  విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు దశలో హైకోర్టు స్టే విధించడం సరికాదని ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటైందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపైనా దర్యాప్తు చేస్తారా? అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది దుష్యంత్‌ దవే వివరణ ఇస్తూ.. అలాంటిది ఏమీ లేదని, అక్రమాలు చోటు చేసుకున్న విషయాలపైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ సిట్ దర్యాప్తు జరుపుతోందని స్పష్టం చేశారు. సిట్‌ దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడని వాదించారు. ‘కొందరు ఆర్టికల్‌ 226 ప్రకారం సిట్‌ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. వ్యక్తిగతంగా ప్రభావితమైతే తప్ప ఆర్టికల్‌ 226 ప్రకారం రిట్‌ దాఖలు చేయలేరు. సిట్‌ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేనివారు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని.. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడాల్సిందే’ అని న్యాయవాది దుష్యంత్‌ దవే అన్నారు. 

మరోవైపు ఈ కేసులో భాగంగా టీడీపీ నేతలు వర్ల రామయ్య సహా ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణలో తుది వాదనలు వింటామని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం స్పష్టం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top