
ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్‌జీ తెలిపారు.
‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్ రన్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.
ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది.