ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యక్తిగతంగా సమర్థిస్తాం

Supreme Court CJ Comment on English Medium Teaching in Public schools - Sakshi

ఇంగ్లిష్‌ మన జీవితంలో భాగమైంది

కానీ వ్యక్తిగత అభిప్రాయాలను విచారణలో చొప్పించలేం

ఇంగ్లిష్‌ మీడియం బోధనపై సుప్రీంకోర్టు సీజే వ్యాఖ్య

విచారణ వచ్చే వారానికి వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను వ్యక్తిగతంగా సమర్థిస్తానని, అయితే తన వ్యక్తిగత అభిప్రాయాలను విచారణలో చొప్పించలేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు సంబంధించి జారీచేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వి.విశ్వనాథన్, న్యాయవాది మెహ్‌ఫూజ్‌ ఎ.నజ్కీ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వు.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే అనేకమంది దళిత, మైనారిటీ, నిరుపేద విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిందని పేర్కొన్నారు. చీఫ్‌ జస్టిస్‌ జోక్యం చేసుకుంటూ ఇదే విషయమై కర్ణాటకకు సంబంధించిన పిటిషన్‌ కూడా ఉందని, రెండింటిని కలిపి విచారిస్తామని చెప్పారు. ఇది ముఖ్యమైన, అత్యవసరంగా వినాల్సిన, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పరిష్కరించాల్సిన అంశమని సీనియర్‌ న్యాయవాది విశ్వనాథన్‌ నివేదించారు. 

మండల కేంద్రంలో తెలుగు మీడియం పాఠశాల ఉంటుంది
విశ్వనాథన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 96 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారన్నారు. ప్రతి మండల కేంద్రంలో తెలుగు మీడియం పాఠశాల అందుబాటులో ఉంటుందని, అక్కడ చదువుకోవాలనుకునేవారికి ఉచిత రవాణా సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. చదువుకునే మీడియం నిర్ణయించుకునే హక్కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పిందని నివేదించారు.

సీజే జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీరు చెల్లుబాటు అయ్యే ఒకే కోణం చెబుతున్నారు. వ్యక్తిగతంగా నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఈ ధర్మాసనంలోని ముగ్గురు సభ్యులం ఏకీభవిస్తున్నాం. ఇంగ్లిష్‌ థ్రూ అవుట్‌ అవర్‌ లైవ్స్‌ (ఇంగ్లిష్‌ మన జీవితంలో భాగమైంది).. మేం వ్యక్తిగతంగా మీతో ఏకీభవిస్తున్నాం. కానీ మా అభిప్రాయాలను విచారణలో ఆపాదించాలని అనుకోవడం లేదు. సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. పిల్లలకు మాతృభాషలో పునాది పడడం చాలా ముఖ్యం..’ అని పేర్కొన్నారు. గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని వ్యాఖ్యానిస్తూ ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top