నా బిడ్డ పేరు చెప్పుకుని డిప్యూటీ సీఎం అయ్యావ్‌ | Sugali Preethi Mother Shocking Comments Pawan Kalyan | Sakshi
Sakshi News home page

నా బిడ్డ పేరు చెప్పుకుని డిప్యూటీ సీఎం అయ్యావ్‌

May 27 2026 2:56 AM | Updated on May 27 2026 2:56 AM

Sugali Preethi Mother Shocking Comments Pawan Kalyan

పవన్‌కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ధ్వజం

నా బిడ్డ కేసులో న్యాయం చేసింది ఒక్క జగనే  

కోరిన వెంటనే సిట్‌ ఏర్పాటు చేసి లైంగికదాడిపై నిర్ధారణ 

ఎన్నికల ముందు పవన్‌కళ్యాణ్‌ ఎన్నో హామీలు ఇచ్చారు 

మొదటి కేసు సుగాలి ప్రీతిదేనని నమ్మించారు 

కానీ కూటమి ప్రభుత్వం అందాల్సిన సాయమూ ఆపేసింది 

సాక్ష్యాలు తారుమారయ్యాయని పవన్‌ మాట మార్చారు

సాక్షి, అమరావతి: పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ.. తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పవన్‌ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.

అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్‌ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్‌ఏ రిపోర్టులు మారిపోయాయని మాటమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి నిందితులు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..  

పచ్చి స్వార్థపరుడు పవన్‌  
‘‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్‌ కళ్యాణ్‌ వాడుకున్నారని అర్థమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబును నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావును పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు.

పవన్‌కళ్యాణ్‌ను కలిసినప్పుడూ ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని పేర్కొన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా? నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్‌కళ్యాణ్‌కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పచ్చి స్వార్థపరుడు.’’ అని పార్వతి వెల్లడించారు.   

రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసును వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి 
‘‘మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్‌ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసి లైంగికదాడి జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు యత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్‌ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసును వాడుకున్నట్టు బహిరంగంగా చెప్పాలి. నిందితులను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.

నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో 2025లో వీల్‌చైర్‌ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్‌చైర్‌ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్‌ని చంద్రబాబు ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న జగన్‌ చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.’’ అని సుగాలి పార్వతి వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement