సాక్షి, తాడేపల్లి: తమ కుమార్తె కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సుగాలి పార్వతి, రాజు నాయక్‌లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.
తొమ్మిదేళ్లు గడిచినా..
ఈ సందర్భంగా 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె ప్రీతిపై అత్యంత దారుణంగా హత్యాచారం చేసి హత్య చేశారు. ఘటన జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదంటూ వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
వైఎస్ జగన్ అండగా నిలిచారు..
వైఎస్ జగన్ హయాంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా తమ కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన సంగతిని గుర్తు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసు పూర్తిగా పక్కనపెట్టిందన్న ప్రీతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి సీబీఐ విచారణ పునరుద్ధరించేలా న్యాయ సహాయం అందించాలని వైఎస్ జగన్‌ను కోరారు.
పెన్షన్ కూడా ఆపేశారు..
అంతేకాక బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో పెన్షన్ ఇవ్వడం లేదని స్థానిక అధికారులు తమకు చెప్పారని ప్రీతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణానికి సాయం చేయాలని పలుమార్లు కోరినా చంద్రబాబు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
అన్ని విధాలా న్యాయం సహాయం అందిస్తాం
ప్రీతి తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రీతి కుటుంబానికి అందించిన సహాయాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
పవన్.. ఇది మీకు సబబేనా?
సుగాలీ ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నారని సుగాలీ ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. సుగాలీ ప్రతీ కేసు విషయమై పవన్‌ను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. ఓ బాధిత కుటుంబాన్ని ఇంతలా హింసించడం పవన్‌కు సబేబేనా? అని నిలదీశారు 2017-19 టీడీపీ హయాంలో సాక్షాలు తారుమారయ్యాయి.పవన్ కళ్యాణ్‌కు ఇదంతా తెలిసి కూడా ఎందుకు మాటిచ్చారని ప్రశ్నించారు. తమ కుమార్తె కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ పవన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాం. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సుగాలీ ప్రీతి కేసులో దోషులకు శిక్షపడేవరకు పోరాడుతూనే ఉంటాం’అని స్పష్టం చేశారు.



