ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్‌ షాక్‌! | The stage is set for installing solar on government buildings | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్‌ షాక్‌!

Jun 4 2026 5:06 AM | Updated on Jun 4 2026 5:06 AM

The stage is set for installing solar on government buildings

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై సోలార్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం 

‘డీమ్డ్‌ జనరేషన్‌‘ విధానం ప్రకారం విద్యుత్‌ వాడకపోయినా బిల్లు చెల్లించాల్సిందే.. 

బిల్లు ఆలస్యమైతే చక్ర వడ్డీ చెల్లించాలంటూ ఒప్పందంలో షరతు 

25 ఏళ్లపాటు సోలార్‌ రూఫ్‌ టాప్‌ నుంచే విద్యుత్‌ తీసుకునేలా ఏర్పాటు 

ప్రభుత్వ సంస్థలపై ఆర్థిక భారం మోపి, ప్రైవేటుకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు 

టెండర్లు ఆహ్వానం

సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన తర్వాత సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన దేవుడెరుగు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని రుణ ఊబిలోకి నెట్టేస్తున్నారు. అది చాలదన్నట్టు ప్రభుత్వ శాఖలను సైతం నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పీఎం సూర్యఘర్‌లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ శాఖల నిధులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు తదితర భవనాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ–నెడ్‌క్యాప్‌) టెండర్లు ఆహ్వానించింది.  

ప్రతిబంధకంగా నిబంధనలు 
ఈ ప్రాజెక్టు కోసం రూపొందించిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో నిబంధనలు ప్రభుత్వ సంస్థలకు ప్రతిబంధకంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రభుత్వ సంస్థలపై దీర్ఘకాలిక ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  

ప్రజాధనం ప్రైవేటు పరం 
25 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో ప్రభుత్వ సంస్థలపై అధిక బాధ్యతలు, ఆర్థిక భారం మోపే నిబంధనలు ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసిన డెవలపర్‌కు ప్రతి యూనిట్‌పై అదనంగా రూ.0.10 సర్వీస్‌ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంస్థలు విద్యుత్‌ బిల్లులను 45 రోజుల్లోపు చెల్లించాలి. గడువు దాటితే నెలకు 1 శాతం చక్రవడ్డీ (కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌) విధించే నిబంధనను చేర్చారు. 

ఇదేం విడ్డూరం 
ఇంకా ఆందోళన కలిగించే అంశం ‘డీమ్డ్‌ జనరేషన్‌‘ విధానం. ప్రభుత్వ సంస్థలు విద్యుత్‌ను పూర్తిగా వినియోగించకపోయినా, లోడ్‌ అందుబాటులో లేకపోయినా,  మీటర్‌ లోపాల కారణంగా విద్యుత్‌ నమోదు కాకపోయినా ఆ విద్యుత్‌ ఉత్పత్తి అయినట్టుగా పరిగణించి డెవలపర్‌కు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 25 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే వరకు ప్రభుత్వ సంస్థలు 100 శాతం విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  ఒప్పందం ఉల్లంఘన జరిగితే రెండేళ్ల సామర్థ్య చార్జీలకు సమానమైన పరిహారం చెల్లించాల్సిందే. దీంతో ప్రభుత్వ సంస్థలు ఒకసారి ఒప్పందం చేసుకుంటే బయటపడటం కష్టం. 

నిర్వహణ బాధ్యత ప్రభుత్వ సంస్థలదే.. 
అదే విధంగా ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసే సోలార్‌ ప్లాంట్ల నిర్వహణ బాధ్యత కూడా ప్రభుత్వ సంస్థలపైనే ఉంచారు. భవనాలపై కొత్త నిర్మాణాలు చేపట్టి ప్యానెళ్లకు నీడ పడినా, భవనం మరమ్మతుల కోసం ప్యానెళ్లను తొలగించాల్సి వ చ్చినా దానికయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వ సంస్థలే భరించాల్సి ఉంటుంది. 

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సంస్థలకు ఇది అదనపు భారంగా మారే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీటర్‌ రీడింగ్‌ సమయంలో ప్రభుత్వ ప్రతినిధి హాజరు కాకపోతే కేవలం డెవలపర్‌ నమోదు చేసిన రీడింగ్‌నే సంయుక్త మీటర్‌ రీడింగ్‌గా పరిగణిస్తామని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ నిబంధనలు ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే నష్టాలను పెంచే ప్రమాదం ఉందని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పెద్ద కంపెనీలకే టెండర్‌
నెడ్‌క్యాప్‌ విడుదల చేసిన టెండర్‌ ప్రకారం ఎంపికైన సంస్థలు 2028 మే వరకు ఎంపానెల్‌లో కొనసాగుతాయి. అనంతరం ప్రభుత్వ భవనాలపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి 25 ఏళ్ల పాటు విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది.అయితే ఈ టెండర్‌లో పాల్గొనే సంస్థలు కనీసం రూ. కోటి వార్షిక టర్నోవర్‌ లేదా అంతే స్థాయి లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కలిగి ఉండాలి. దీంతో రాష్ట్రంలోని అనేక చిన్న సోలార్‌ వ్యాపార సంస్థలు అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

గత మూడేళ్లలో కనీసం 500 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్‌ ప్రాజెక్టులు పూర్తి చేసిన అనుభవం ఉండాలని నిబంధన విధించారు. ఈ అర్హత కూడా కొత్తగా రంగంలోకి వ చ్చిన సంస్థలకు పెద్ద అడ్డంకిగా మారనుంది. మరోవైపు ఎంపానెల్‌ అయిన సంస్థలకు సుమారు 5 మెగావాట్ల చొప్పున కేటాయించనున్నారు. ఒకే సంస్థకు గరిష్టంగా 40 మెగావాట్ల వరకు పనులు దక్కే అవకాశం కల్పించారు. దీంతో పెద్ద కంపెనీలకే అధిక ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement