దిశ యాప్‌పై అవగాహనకు ప్రత్యేక డ్రైవ్‌

Special Drive For Awareness On Disha App - Sakshi

గ్రామ, వార్డు మహిళా పోలీసులు, వలంటీర్లతో ప్రజలకు అవగాహన

పాఠశాలలు, కళాశాలల్లోనూ ప్రత్యేక సదస్సులు

రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశాలు

సాక్షి, అమరావతి/ఒంగోలు: రాష్ట్రంలో మహిళా భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యార్థినులు, యువతులు, మహిళలు అందరూ ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, వినియోగించుకునేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్‌ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, సబ్‌ డివిజన్‌ అధికారులు, సీఐలు, ఎస్సైలు, దిశ పోలీస్‌ స్టేషన్ల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళా పోలీసులు, మహిళా పోలీసు అధికారులు దిశ యాప్‌పై మహిళలకు అవగాహన కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, గ్రామ/వార్డు వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణ తర్వాత వీరంతా తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి వారి ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతోపాటు అత్యవసర సమయాల్లో యాప్‌ను వినియోగించడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీంతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి దిశ యాప్‌పై అవగాహన కల్పించాలని చెప్పారు.

మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా దోషులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందన, ఏపీ పోలీస్‌ సేవా యాప్, దిశ యాప్, సైబర్‌మిత్ర, వాట్సాప్‌ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు కేసులు నమోదు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను డీజీపీ పునరుద్ఘాటించారు. తమ పరిధి కానప్పటికీ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కూడా ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు రవిశంకర్‌ అయ్యన్నార్, హరీష్‌కుమార్‌ గుప్తా, శంకర బత్ర బాగ్చి, ఐజీ నాగేంద్రకుమార్, దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం ఎస్పీ ‘మ్యాపింగ్‌’ ఐడియా అమలు
డీజీపీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల అనుమానాస్పద శివారు ప్రాంతాలను, గతంలో అవాంఛనీయ ఘటనలు జరిగిన ప్రదేశాలను, నేరాలు జరగడానికి ఆస్కారం ఉండే ప్రదేశాలను గుర్తించి, మ్యాపింగ్‌ చేయడం ద్వారా ఆయా ప్రదేశాల్లో ప్రత్యేక బీట్లు ఏర్పాటు చేసి, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. తద్వారా నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ ‘మ్యాపింగ్‌’ ఐడియా పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు యూనిట్లలోనూ దీనిని అమలు చేయాలని ఆదేశించారు.

చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త..
ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top