ఎంబీబీఎస్‌తో సమానంగా పీజీ సీట్లు

PG Seats Equivalent To MBBS - Sakshi

తాజాగా నిబంధనలు సడలించిన జాతీయ మెడికల్‌ కమిషన్‌

ప్రస్తుతం రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్, 910 పీజీ వైద్యసీట్లు

పెరగనున్న 1,275 పీజీ సీట్లలో 308 సీట్లకు ఎసెన్షియాలిటీ జారీ

ఇంకా 967 సీట్లు పెంచుకునేందుకు ఏర్పాట్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో వైద్య విద్యార్థులకు మరో శుభవార్త. ఎంబీబీఎస్‌తో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచేందుకు వీలుగా జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలను సడలించింది. ఇకపై మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు (అండర్‌ గ్రాడ్యుయేట్‌) ఎన్ని ఉంటాయో పీజీ వైద్య సీట్లను కూడా ఆ మేరకు పెంచుకోవచ్చని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

దీంతో వైద్యవిద్యా శాఖ పీజీ వైద్య సీట్ల పెంపుపై దృష్టి సారించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లుండగా 910 మాత్రమే పీజీ వైద్య సీట్లున్నాయి. ఇప్పుడు అదనంగా 1,275 సీట్లను పెంచుకునే వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 308 పీజీ సీట్లకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్‌ జారీచేసింది. అంటే వచ్చే ఏడాది ఈ 308 సీట్లు దాదాపుగా ఖరారైనట్టే. ఇవికాకుండా 967 సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్‌ కాలేజీల్లో పీజీ వైద్య సీటును రూ. కోట్లలో విక్రయిస్తున్న తరుణంలో ప్రభుత్వ కాలేజీల పరిధిలో సీట్లు పెరగనుండటం మెరిట్‌ విద్యార్థులకు వరం లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు.

వైద్యులు, మౌలిక సదుపాయాలు..
కొత్తగా సీట్లు పెరగాలంటే తగినంత మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌లు, ప్రొఫెసర్లు విధిగా అవసరం. దీంతో పాటు మౌలిక వసతులను కూడా మెరుగు పరచాల్సి ఉంటుంది. నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందినీ నియమించుకోవాలి. వీటన్నిటిపైనా వైద్యవిద్యాశాఖ ప్రత్యేక నివేదిక తయారు చేస్తోంది. పెంచుకునే అవకాశం ఉన్న ప్రతి సీటునూ ఎలాగైనా సాధించేలా కసరత్తు చేస్తున్నారు.

మంచి అవకాశం..
జాతీయ మెడికల్‌ కమిషన్‌ పీజీ సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకునే దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం 308 పీజీ సీట్లకు అనుమతిచ్చింది. మిగతా సీట్లకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల భారీగా ఎంబీబీఎస్‌ సీట్లు పెరుగుతాయి’
– డా.రాఘవేంద్రరావు, వైద్యవిద్యా సంచాలకులు

చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్‌  
ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top