రైల్వేజోన్‌కు సర్వం సిద్ధం | South Coast Railway Zone Operations to Begin in Visakhapatnam From June 1 | Sakshi
Sakshi News home page

రైల్వేజోన్‌కు సర్వం సిద్ధం

May 31 2026 5:03 AM | Updated on May 31 2026 5:03 AM

 South Coast Railway Zone Operations to Begin in Visakhapatnam From June 1

విశాఖలో డివిజనల్‌ రైల్వే హాస్పిటల్‌ వద్ద ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ స్థానంలో సౌత్‌ కోస్ట్‌ జోన్‌గా పేరు మార్పు

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రారంభానికి ఏర్పాట్లు

సరిహద్దుల్లో బోర్డులు మారుస్తున్న సిబ్బంది 

మూడు జోన్లలోనూ ఆదివారం సెలవు రద్దు చేసిన రైల్వే బోర్డు

ఉద్యోగులంతా ఏర్పాట్లలో విధిగా పాల్గొనాలని ఆదేశాలు 

విశాఖపట్నానికి రైల్వే ఉన్నతాధికారులు 

నేడు విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయంలో జీఎంల అత్యవసర సమావేశం 

దక్షిణకోస్తా రైల్వే జోన్‌ సీపీఆర్‌వోగా బాలాజీ కిరణ్‌ నియామకం

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల స్వప్నమైన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్‌ ప్రారంబోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని రైల్వే బోర్డు భావిస్తోంది. విశాఖ నుంచి ఏదైనా కొత్త రైలు ప్రారంభించినప్పుడు భారీగా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఒక్క రోజే గడువు ఉండటంతో అనుబంధ జోన్లు, డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవుని రద్దు చేసి విధులకు హాజరవ్వాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. 1వ తేదీన జరిగే ప్రారంబోత్సవంలో పాల్గొనేందుకు దక్షిణ కోస్తా జోన్‌ పరిదిలోని డీఆర్‌ఎంలు విశాఖకు వస్తున్నారు.దీనిపై నేడు డెక్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జీఎంల అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. 

క్షేత్ర స్థాయి పనుల్లో రైల్వే ఉద్యోగులు  
జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాట్లలో జాప్యం జరగకుండా ఉండేందుకు రైల్వేబోర్డు ఆయా డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఉద్యోగీ విధిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. పరిపాలన, క్షేత్ర స్థాయి పనులపై పూర్తి దృష్టి సారించింది. ప్రారంబోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, కొత్త జోన్‌ పరిధిలోకి వచ్చే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ల రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎంలు) శనివారం విశాఖ జోన్‌ జీఎం సందీప్‌ మాథుర్‌తో సమావేశమయ్యారు. మరోవైపు  రైల్వే బోర్డు అధికారులకు దక్షిణ కోస్తా, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జీఎంలు, డీఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ఆస్తులు విభజనపై ఈ భేటీలో చర్చించారు.

కొత్త బోర్డులతో హద్దుల మార్పు 
జోన్‌ ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో క్షేత్రస్థాయిలో పనులు ఊపందుకున్నాయి. కొత్త జోన్‌ సరిహద్దులను ఖరారు చేస్తూ, పాత బోర్డుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్న రైల్వే కార్యాలయాలు, కల్యాణమండపాలు, ఇతర భవనాల వద్ద ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ స్థానంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అని మారుస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల హడావుడితో జోన్‌ కార్యాలయంతోపాటు పరిసరాల్లో సందడి నెలకొంది.  

సీపీఆర్వోగా బాలాజీ కిరణ్‌
మరోవైపు పాలనాపరమైన కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్వోగా బాలాజీ కిరణ్‌ను నియమించింది. ఒక పక్క క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, మరోపక్క పరిపాలనా విభాగాల కూర్పుతో జోన్‌ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. రద్దీకి అనుగుణంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు నుంచి అదనపు రైళ్లు, వందేభారత్‌ కనెక్టివిటీ పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. జూన్‌ 1 నుంచి జోన్‌ అమల్లోకి రాగానే వైజాగ్‌ – సికింద్రాబాద్‌ వందేభారత్‌తోపాటు పలు రైళ్ల నిర్వహణ, అడ్మిని్రస్టేషన్‌ కంట్రోల్‌ మొత్తం విశాఖ కేంద్రంగా జరగనుండటంతో ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందనున్నాయి.

కొత్త రైల్వే జోన్‌లోకి స్వాగతం!
మధిర: ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ను నూతనంగా ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగిన విజయవాడ డివిజన్‌ను కొత్తజోన్‌లోకి మార్చారు. అలాగే, ఇన్నాళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మధిర, తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లను విశాఖ జోన్, విజయవాడ డివిజన్‌ పరిధిలోకి బదలాయించారు.

ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుండగా.. మధిర మండలం బయ్యారం సమీపాన కొత్త జోన్‌ పరిధిని సూచిస్తూ సిబ్బంది శనివారం బోర్డు ఏర్పాటు చేశారు. కాగా, ఇన్నాళ్లు రైల్వే ఉద్యోగులు, ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం సికింద్రాబాద్‌ వెళ్తుండగా.. ఇకపై జీఎంను కలవాలంటే విశాఖకు, ఇతర అధికారులను కలిసేందుకు విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ పరిధిలోని మూడు రైల్వేస్టేషన్ల పరిధి ఉద్యోగులు, ప్రజలు పాలనపరమైన అంశాల్లో ఇబ్బంది ఎదురవుతుందని ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement