సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం | Sakshi
Sakshi News home page

లారీ కింద పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం

Published Sun, Jul 24 2022 7:30 PM

Software Employee Died In Road Accident At West Godavari - Sakshi

పశ్చిమ గోదావరి: ఆగడాలలంక శివారు వద్ద లారీ కింద పడి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రూరల్‌ మండలం పైడిచింతపాడుకు చెందిన ముంగర హర్షవర్దన్‌ (30) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే విధులను నిర్వహిస్తున్నాడు. శనివారం బ్యాంకు పని నిమిత్తం తన స్కూటిపై హర్షవర్దన్‌ పైడిచింతపాడు నుంచి ఏలూరు బయలుదేరాడు.

ఆగడాలలంక శివారు వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ఇటుకల లోడు లారీని అధిగమించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్కూటి ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు లారీ చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భీమడోలు ఏఎస్సై చలపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవ పంచానామా అనంతరం బంధువులకు అప్పగించారు. ఏఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

పైడిచింతపాడులో విషాదఛాయలు 
హర్షవర్దన్‌ మృతితో పైడిచింతపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ముంగర బోజరాజు, ఝాన్సీలక్షి్మల పెద్ద కుమారుడు హర్షవర్దన్‌కు మూడేళ్ల క్రితం దుర్గాశ్రీతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఎనిమిదో నెల గర్భిణి. భార్య డెలివరీ తర్వాత బెంగళూరుకు కుటుంబ సమేతంగా వెళదామని భావించాడని, ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు కబళించిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. దేవుడు తనకు అన్యాయం చేశాడంటూ భార్య దుర్గాశ్రీ గుండెలవిసేలా రోదించడంతో ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి మెలిగే హర్షవర్దన్‌ మృతి చెందాడన్న వార్తను గ్రామస్తులు జీరి్ణంచుకోలేకపోతున్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement