భారీగా పెరిగిన రొయ్యల ఫీడ్ ధరలు
టన్నుకు రూ.8,420 నుంచి రూ.10,530 వరకు పెంపు
మంగళవారం నుంచే అమలులోకి అప్సడాతో సంబంధం లేకుండానే పెంచేస్తున్న కంపెనీలు
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ టన్నుకు రూ.4వేలు పెరుగుదల పెంపు వెనుక చంద్రబాబు ప్రభుత్వ హస్తం
మెజార్టీ కంపెనీలు టీడీపీ నేతలకు చెందినవే
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’ వన్నె పులులు ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు తెగబడ్డాయి. మీకింత మాకింత అనే ధోరణిలో ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఆక్వా గొంతు నులిమేస్తున్నాయి. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పెత్తనమంతా..‘టీడీపీ’ ఫీడ్ కంపెనీలదే
రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా, వెనామి రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు రెండున్నర చొప్పున సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తారు. ఈ లెక్కన ఏటా రూ.15వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్‌దే. ఆ తర్వాత 20 శాతం దేవీ ఫీడ్స్‌ది కాగా, మిగిలిన వాటా బీఎంఆర్ (టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు), సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజార్టీ తయారీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. పైగా మంత్రులతోపాటు ప్రభుత్వంలోని కీలక నేతలకు నెలవారీగా వాటాల మూటలు వెళ్తుండడంతో ప్రభుత్వంలో ఏ ఒక్కరూ నోరుమెదపలేని దుస్థితి నెలకొందని సమాచారం.
రైతులతో చర్చించకుండానే ధరల పెంపు..
వాస్తవంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ(అప్సడా) చట్టం ప్రకారం ఫీడ్, సీడ్ కంపెనీలే కాదు.. ఆక్వారంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సడా అనుమతి తీసుకోవాలి. ధరల పెంపు అనివార్యమైనప్పుడు తొలుత అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై, వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిరీ్వర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని గతేడాది కేంద్రం 30 శాతం నుంచి 5–15 శాతానికి తగ్గించగా, కొన్ని ఉత్పత్తులకు పూర్తిగా మినహాయించింది. ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు తగ్గించాలి.
కానీ ఆ దిశగా కంపెనీలు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. నాడు కంటి తుడుపు చర్యగా టన్నుకు ఎమ్మారీ్పపై రూ.4వేలు తగ్గించిన కంపెనీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పా పెట్టకుండా టన్నుకు మళ్లీ రూ.4వేల చొప్పున పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో వెనామీ ఫీడ్‌పై రూ.12వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.14వేలు పెంపునకు అనుమతినివ్వాలంటూ గతనెల 30న మత్స్యశాఖ కమిషనర్‌కు రొయ్య మేత తయారీ దారుల సంఘం లేఖ రాసింది. స్టేక్ హోల్డర్లతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుందామని కమిషనర్ బదులిచ్చారు. కానీ స్టేక్ హోల్డర్లతో సమావేశం, చర్చలు జరపకుండానే ఏకపక్షంగా ధరలు పెంచాయి. మేత వ్యాపారంలో 50 శాతం వాటా కలిగిన అవంతి ఫీడ్స్ టన్నుకు వెనమి ఫీడ్‌పై రూ.8,420, టైగర్ ఫీడ్ పై రూ. 10,530 పెంచగా.. మిగిలిన కంపెనీలు వెనమి ఫీడ్‌పై రూ.8 వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.10 వేలు చొప్పున పెంచాయి.
పెట్టుబడిలో సగానికిపైగా మేతకే..
రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.60 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.3.50 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేతకే రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, ప్రస్తుతం రూ.లక్షకు పైగా ఉంది. తాజా పెంపుతో మేతధ రలు పన్నులతో కలిపి రూ.1.15లక్షలకుపైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.3.75 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019–24 మధ్యలో కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కారూ ధరల తగ్గింపునకు కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సిండికేట్‌గా మారి దోచేస్తున్నారు.
ఏపీ అప్సడా చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచడానికి లేదు. కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి ధరలు ఒక్కసారిగా పెంచాయి. తక్షణమే ఈ పెంచిన ధరలను తగ్గించాలి.
–దుగ్గినేని గోపినాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం ప్రకాశం జిల్లా
కంపెనీలు ఏకపక్ష ధోరణి తగదు
ఫీడ్ తయారీ కంపెనీలకు ఏటా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటా పెట్టుబడి ధరలు పెరుగుతున్నాయే తప్ప రైతులకు ఆదాయం మాత్రం పెరగడం లేదు. కేంద్రం ద్వారా వివిధ రకాల రాయితీలు పొందుతున్న కంపెనీలు ఇష్టమొచ్చినట్టుగా ఫీడ్ ధరలు పెంచేస్తూ రైతులను దోచుకుంటున్నాయి. ఇది తగదు.
– టి.నాగభూషణం, అధ్యక్షుడు, కోనసీమ రొయ్య రైతుల సంఘం


