టీడీపీలో అసంతృప్తి జ్వాలలు | Several senior TDP leaders unhappy in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీలో అసంతృప్తి జ్వాలలు

May 12 2026 4:48 AM | Updated on May 12 2026 4:48 AM

Several senior TDP leaders unhappy in Andhra Pradesh

పార్టీ కమిటీల నియామకంపై నేతల తీవ్ర అసహనం  

యువతకు ప్రాధాన్యత పేరుతో సీనియర్లు, ముఖ్యనేతలకు చెక్‌ 

కీలక పదవుల నుంచి అలంకారప్రాయ పదవులిచ్చి పక్కనపెట్టిన వైనం 

రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన కళా వెంకట్రావుకు ఉపాధ్యక్ష పదవి! 

బొండా, సోమిరెడ్డి వంటి సీనియర్లను పొలిట్‌బ్యూరో నుంచి తప్పించి డమ్మీ పదవులు  

2024 విన్నింగ్‌ టీమ్‌ అని చెప్పిన 175 మంది పరిశీలకుల్లో 90 శాతం మందికి ఉద్వాసన  

మంత్రి పదవులు కావాలంటున్న సీనియర్లకు పార్టీ పదవులు 

పలు జిల్లాల్లోనూ ప్రాధామ్యాలు మార్చిన లోకేశ్, చంద్రబాబు  

డబ్బు, లాబీయింగ్‌ చేసే నేతలను అందలం ఎక్కించడంపై పార్టీలో ఆందోళన  

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల నియామకంపై ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ధనబలం ఉన్న నేతలు, లాబీయిస్టులకే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోందని నేతలు ఆవేదన చెందుతున్నారు. తన తనయుడు లోకేశ్‌కి అనుకూలంగా పార్టీ యంత్రాంగాలను చంద్రబాబు రూపొందించినట్లు తెలుస్తోంది. సీనియర్లను కొనసాగించినా వారి ప్రాధాన్యతను మాత్రం తగ్గించేశారు. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవమానకరంగా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు.

గతంలో పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావులను పక్కకు తప్పించారు. సోమిరెడ్డిని అధికార ప్రతినిధిగా, బొండా ఉమాను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. రాజ్యసభ స్థానం అడుగుతున్న సీనియర్‌  నేత యనమల రామకృష్ణుడుకు అది ఇవ్వకపోగా అవమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పొలిట్‌బ్యూరోలో ఆయన్ని కొనసాగించి పార్టీలో పదవే తప్ప ఇతర కీలక పదవులు ఇవ్వబోమని తేల్పిచెప్పారు. 

ఈసారైనా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్న సీనియర్‌ నాయకులు జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పితాని సత్యనారాయణలకు అనూహ్యంగా పొలిట్‌బ్యూరోలో చోటిచ్చి సరిపెట్టారు. బుచ్చయ్య తాను ఎమ్మెల్యే కావడం ఇదే చివరిసారి కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. జ్యోతుల నెహ్రూ ఒక్కసారైనా తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ వారిని పొలిట్‌బ్యూరో సభ్యులుగా నియమించారంటే ఇక మంత్రి పదవులు లేవని చెప్పినట్లేనని చర్చ జరుగుతోంది.  

జిల్లాల్లో మారిన టీడీపీ నాయకత్వం
పలు జిల్లాల్లోనూ ప్రాధాన్యతలు మారిపోయినట్లు టీడీపీ కమిటీల కూర్పును బట్టి అర్థమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎప్పుడూ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉండేవారు. బీద రవిచంద్ర, పొంగూరు నారాయణ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వీరందరినీ పక్కనపెట్టి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని పొలిట్‌బ్యూరోకి తీసుకున్నారు. సోమిరెడ్డిని పొలిట్‌బ్యూరో నుంచి తప్పించి ప్రాధాన్యత తగ్గించి అధికార ప్రతినిధిగా నియమించారు. బీద, నారాయణలకైతే ఏ కమిటీలోను స్థానమే లేకుండాపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారికి ప్రాధాన్యత తగ్గించారు.

పల్లా శ్రీనివాసరావును మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. వంగలపూడి అనితకు పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా అవకాశం ఇచ్చి సీనియర్లయిన గంటా శ్రీనివాసరావు వంటి నేతలను పక్కనపెట్టారు. విజయనగరంలో అశోక్‌గజపతిరాజు కుటుంబానికి ప్రాధాన్యత లేకుండానే కమిటీల నియామకం జరిగింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కళా వెంకట్రావు ప్రాధాన్యత తగ్గించారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, చింతమనేని ప్రభాకర్‌ వంటి వారిని పక్కనపెట్టి నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజులను అందలం ఎక్కించారు. ఉమ్మడి కృష్ణాలో దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్‌ల స్థానాన్ని కొల్లు రవీంద్ర సొంతం చేసుకున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ల కంటే గళ్లా మాధవి, అనగాని సత్యప్రసాద్‌కి పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురంలో జేసీ, పరిటాల కుటుంబాల స్థానంలో బీసీ జనార్ధన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు ప్రాధాన్యత పెంచారు. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పించారు. గత ఎన్నికలకు ముందు 175 నియోజకవర్గాలకు 175 మంది పరిశీలకులను నియమించి 2024 ఎన్నికల విన్నింగ్‌ టీమ్‌గా వారితో పనిచేయించారు. వారిలో 150 మందికి ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదు. మరోవైపు తమకు అనుంగు అనుచరులుగా ఉన్న కిలారు రాజేష్, సానా సతీష్‌ వంటి పార్టీకి సంబంధం లేనివారిని అందలం ఎక్కించారు. మొత్తం మీద ఈ కమిటీలు పార్టీలో అసంతృప్తిని, అసమ్మతిని రగిలించాయి.

Advertisement
 
Advertisement
Advertisement