ఆరంచెల నూతన విధానంలో స్కూళ్లు ప్రారంభం 

Schools restart under new system in Andhra Pradesh - Sakshi

పీపీ1, పీపీ2లతో కూడిన శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు  

పిల్లలను స్కూళ్లకు రప్పించేలా చర్యలు

సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. 2022–23 విద్యా సంవత్సరపు బోధనాభ్యసన కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో సమగ్రంగా కొనసాగించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. ఏ రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టాలో అందులో పొందుపరిచింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి.

తొలి రోజునే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్టూడెంట్‌ కిట్ల పంపిణీ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ. 931.02 కోట్లతో ఈ కిట్లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్ల విద్యార్థులందరికీ అందిస్తారు. ప్రభుత్వం స్కూళ్లను ఆరంచెల నూతన జాతీయ విద్యా విధానం కింద మార్పులు చేసింది. నూతన విధానంలోనే స్కూళ్లు ప్రారంభమయ్యాయి.

పునాది విద్యను బలోపేతం చేసేందుకు పీపీ1, పీపీ2లతో కూడిన శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. శాటిలైట్‌ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, ప్రీ హైస్కూలు, హైస్కూల్‌ ప్లస్‌గా ఈ స్కూళ్లు ఉంటాయి. ఇప్పటివరకు విలీన ప్రక్రియ పూర్తయిన ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లకు తరలించేందుకు విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు కూడా జారీచేసింది.

ఈ సంవత్సరంలో 220 రోజుల పాటు స్కూళ్లు పనిచేస్తాయి. పాఠశాలలల ప్రారంభానికి జూన్‌ 28వ తేదీ నుంచే స్కూల్‌ రెడీనెస్‌ కార్యక్రమాన్ని విద్యా శాఖ చేపట్టింది. ప్రతి పాఠశాలను శుభ్రం చేయించడం, మంచినీటి సదుపాయం ఏర్పాటుతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామాల్లోని పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోకి రప్పించేలా గ్రామ సందర్శన కార్యక్రమాలను కూడా నిర్వహించింది.

ప్రభుత్వం విద్యా పరంగా అమలుచేస్తున్న కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలను బడుల్లో చేర్చేలా ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది బడి ఈడు పిల్లలెవరూ బడి బయట ఉండకుండా 100 శాతం చేరికలు ఉండేలా కార్యాచరణ చేపట్టింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top