జీవో ఒకలా.. అమలు ఇంకోలా! | School Education Department rejects allegations of irregularities in Mega DSC | Sakshi
Sakshi News home page

జీవో ఒకలా.. అమలు ఇంకోలా!

Jun 1 2026 5:29 AM | Updated on Jun 1 2026 5:29 AM

School Education Department rejects allegations of irregularities in Mega DSC

డీఎస్సీ తప్పులపై అధికారుల వింత వాదన

హారిజాంటల్‌ రిజర్వేషన్‌కు సరికొత్త అర్థం చెబుతున్న వైనం

1:1 పిలిచినా పోస్టుకు ఎంపికైనట్లు కాదని సమర్థింపు

సాక్షి, అమరావతి: హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమ­లు ప్రక్రియను తప్పుగా అర్థం చేసుకుంటూ మెగా డీఎస్సీ–2025పై ఆరోపణలు చేస్తున్నారని పాఠశా­ల విద్యా శాఖ బుకాయిస్తోంది. డీఎస్సీలో అక్ర­మా­లు బట్టబయలు అవుతుండటంతో ఉక్కిరి­బిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఏదోలా ఈ స్కామ్‌ నుంచి బయట పడాలని వి­ద్యా శాఖ ద్వా­రా పొంతనలేని రీతిలో సమాధానా­లిప్పిస్తోంది. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమా­లపై ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా త­ప్పు జరగలేదంటూనే పలు ప్రశ్నలకు సమాధా­నా­లు దాటవేశారు. ఈ నేపథ్యంలో ఆది­వారం సాక్షి దినపత్రికలో ‘తప్పుపై తప్పు.. స్పో­ర్ట్సు డీఎస్సీపై మాకు తెలియదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వివరణ ఇస్తూ విద్యా శాఖ డైరెక్టర్‌ ఆది­వారం ప్రకటన విడు­దల చేశారు. ‘సర్టిఫికెట్‌ వె­రిఫికేషన్‌ కోసం 1:1 నిష్పత్తిలో కాల్‌ లెటర్లు జారీ చేసినప్పటికీ, వెరిఫికేషన్‌కు హాజరైన పలువురు అభ్యర్థులకు తుది ఎంపిక జాబితాలో చోటు దక్క­లేదన్న ఆరోపణ సరికాదు. ఇది హారి­జాంటల్‌ రిజ­ర్వేషన్‌ను తప్పుగా అర్థం చేసుకో­వ­డం వల్ల వచ్చింది.

అర్హత, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రా­లను పరిశీలించే ఉద్దేశంతో, నో­టిఫై చేసిన ఖాళీల సంఖ్యకు అనుగుణంగా ఆ­యా వర్టికల్‌ రిజర్వేషన్, హారిజాంటల్‌ రిజర్వేషన్‌ వ­ర్గాల పరిధిలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్‌ వెరిఫి­కే­ష­న్‌ కాల్‌ లెటర్లు జారీ చేశాం. ఆ తర్వాత తుది ఎంపిక జాబితాలను సిద్ధం చేసే సమయంలో మహి­ళలు, దివ్యాంగులు, మాజీ సైనికో­ద్యోగులు, మెరి­టో­రియస్‌ స్పోర్ట్స్‌ పర్స­న్స్‌కు వర్తించే హారిజాంటల్‌ రిజర్వేషన్‌ స­ర్దు­బాట్లను జీవో ఎంఎస్‌ నం.77 ప్రకారం వర్తింప­జేశాం. ఇది అర్థం చేసుకోలేక సర్టిఫికెట్‌ వెరిఫి­కేషన్‌­కు హాజరైన వారిలో కొందరు తమకు ఉద్యోగాలు రాలేదంటున్నారు’ అని పేర్కొన్నారు.   

1:1 నిష్పత్తి అంటే అర్థమేంటి మరి?
జీవో77 ప్రకారం 1:1 జాబితా ఎప్పుడు తయార­వు­తుందంటే హారిజాంటల్‌ రిజర్వేషన్లను (మహి­ళలు, వికలాంగులు, మాజీ సైనికులు, క్రీడాకా­రు­లు) మొదట మార్కుల మెరిట్‌ ఆధారంగా ఓసీ, తర్వాత సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్‌) వారీగా జాబితాలను సిద్ధం చే­యాలి. ఆ తర్వాతే మహిళలు, ఇతర హారిజాంటల్‌ కోటాలో లోటును తనిఖీ చేసి, అవసరమైతే జాబి­తా చివరన ఉన్న అభ్యర్థులను తొలగించి, నిర్దేశిత ప్రత్యేక వర్గాల అభ్యర్థులను చేర్చి ‘తాత్కాలిక ఎంపిక జాబితా’ ఖరారు చేయాలి.

ఇలా హారిజాంటల్‌ రిజర్వేషన్లు అప్లై చేసి పూర్తి స్థాయిలో సర్దుబాటు చేసిన తర్వాతే, కచ్చితంగా ఉద్యోగానికి ఎంపిక­య్యే అవకాశం ఉన్న వారితోనే 1:1 (ఒక పోస్టుకు ఒకరు) జాబితాను ప్రకటించాలి. హారిజాంటల్‌ రి­జ­ర్వేషన్‌ అమలు చేసిన తర్వాత అర్హులైన అభ్య­ర్థు­ల తాత్కాలిక ఎంపిక జాబితా (1:1) సిద్ధం చే­యా­లి. అందులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లు  తని­ఖీ చే­యడానికి కాల్‌ లెట­ర్లు పంపాలి.

సర్టిఫికెట్‌ వెరి­ఫికేషన్‌ అయ్యాక, ఎటువంటి లోపాలు లేని వారి­తో తుది జాబితాను ప్రకటించాలి. మెగా డీఎ­స్సీ–­2025లో ఇలా చేయకుండా కొందరు అ­భ్య­ర్థులకు అన్యాయం చేయడం వాస్తవమని బా­ధిత మెరిట్‌ అభ్యర్థులు వాపోతున్నారు. దీన్ని ఒ­ప్పుకోకుండా  అధికా­రు­లు వింత వాదనను వినిపిస్తు­న్నారని నిపుణులు చెబుతున్నారు. సర్టిఫి­కెట్ల పరిశీలనలో పాల్గొన్నంత మాత్రాన పోస్టు ఎంపికకు గ్యారంటీ లేదని ముందే పేర్కొన్నామంటూ ‘కండీషన్స్‌ అప్లై’ అన్న రీతిలో చెప్పడం కొసమెరుపు.

Advertisement
 
Advertisement
Advertisement