ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ ఎలా వర్తిస్తుంది? | Judge Serious On AP Police For Registered SC ST Act On Kommineni Srinivasa Rao, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ ఎలా వర్తిస్తుంది?

Jun 11 2025 5:52 AM | Updated on Jun 11 2025 9:10 AM

SC ST Act on Kommineni Srinivasa Rao : Judge Serious on AP Police

వైద్య పరీక్షల అనంతరం గుంటూరు జీజీహెచ్‌ నుంచి బయటకు వస్తున్న కొమ్మినేని

కొమ్మినేనిపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం 

ఎస్సీల గురించి మాట్లాడకుండానే ఆ యాక్ట్‌ పెట్టేస్తారా?.. గతంలో మెమో జారీ చేసినా మీ వైఖరిలో మార్పు రాలేదంటూ డీఎస్పీపై ఆగ్రహం 

ఈ కేసులో మీకు, ఎస్పీకి మెమో జారీ చేస్తా..  

ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌.. 356(2) సెక్షన్‌ను తొలగించాలని ఆదేశం 

కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్‌.. గుంటూరు జైలుకు తరలింపు  

సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస­రావుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారని గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి (ఇన్‌చార్జ్‌) కె.సురేష్‌బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్‌ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ డిబేట్‌లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ‘ఫిర్యాదుదారు ఎస్సీ అయినంత మాత్రాన కేసు పెట్టేస్తారా? అసలు ఈ చట్టం కింద కేసు నమోదు చేసేటప్పుడు దర్యాప్తు అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారిని ఎందుకు పెడతారో తెలుసా? ఆ చట్టం దుర్వినియోగం కాకూడదని.. అటువంటిది ఒక డీఎస్పీగా ఉండి కనీసం ఎవరి సలహా తీసుకోకుండా ఈ చట్టం కింద కేసు ఎలా నమోదు చేశారు?’ అని నిలదీశారు. ‘మీ వైఖరి మొదటి నుంచి ఇలానే ఉంది.

గతంలో కూడా ఇలానే వ్యవహరించారు. అప్పుడు మెమో జారీ చేశాను. అయినా మీ వైఖరిలో మార్పు రాలేదు. ఈ కేసు విషయంలో మీకు, ఎస్పీకి మెమో జారీ చేస్తాను. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌.. 356(2) సెక్షన్‌ను తొలగించండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు తన పేరుతో నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమంలో ఒక విశ్లేషకుడు అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొమ్మినేనిపై బీఎన్‌ఎస్‌ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.  మంగళవారం ఆయన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయ­మూర్తి పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నిసార్లు చెప్పినా పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం డిబేట్‌ అంశంపై కొమ్మినేని శ్రీనివాసరావును ప్రశ్నించారు.

వారించాను.. నేను కూడా క్షమాపణ చెప్పాను..
‘నేను 18 సంవత్సరాలుగా డిబేట్‌ నిర్వహిస్తున్నా. ఎవరైనా హద్దు మీరి మాట్లాడుతుంటే వెంటనే ఆపుతాను. ఈ అంశంలో కూడా నేను వారించాను. నేను తప్పు చేయలేదు. అయినా రెండో రోజు చర్చలో క్షమాపణ చెప్పాను. నేను ఎప్పుడూ అసభ్య పదజాలం వాడలేదు’ అని ఈ సందర్భంగా కొమ్మినేని జడ్జికి వివరణ ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీనిపై కొమ్మినేని తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వాదనలు వినాలని, అసలు కొమ్మి­నేనిపై కేసే అక్రమమని వాదించారు.

తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా జైలులో సదుపాయాలు కల్పించాలని కొమ్మినేని కోరగా, జైలర్‌తో మాట్లాడాలని పోలీసు అధికారులకు న్యాయమూర్తి సూచించారు. ఒకవేళ జైలు అధికారులు అంగీకరించకపోతే తన వద్ద అప్పీల్‌ చేసుకుంటే ఆదేశాలు ఇస్తానని చెప్పా­రు. సోమవారం అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబ సభ్యులను కలవనీయడం లేదని కొమ్మినేని శ్రీనివాసరావు భార్య, బంధు­వులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. వారు కొమ్మి­నేనితో మాట్లా­డేందుకు అవకాశం ఇవ్వాలని, వారు మాట్లాడుతుండగా వీడియో తీసి తనకు చూపించా­లని ఆదేశించారు. కోర్టు ఆదేశాల అనంతరం కొమ్మి­నేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

గంటన్నరపాటు వైద్య పరీక్షలు  
అంతకు ముందు కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి అంతా పోలీస్‌­స్టేషన్‌లోనే ఉంచి మంగళవారం ఉదయం 9 గంట­లకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గంటన్నరపాటు వైద్య పరీక్షలు చేసిన అనంతరం కొమ్మినేని బయటకు వచ్చే దృశ్యాలను చిత్రీకరించే సమయంలో పోలీసులు మీడియాపై దౌర్జన్యం చేశారు. కొత్తపేట సీఐ వీరయ్యచౌదరితో పాటు అక్కడున్న మరో సీఐ బెదిరించే ప్రయత్నం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement