ఇంటి పెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి?

Retired Justice DSR Verma Interview With Sakshi

‘సాక్షి’తో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ డీఎస్‌ఆర్‌ వర్మ

సీజేఐకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖలో ఏమాత్రం తప్పులేదు

న్యాయమూర్తులేమీ చట్టానికి అతీతులు కారు

ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమనడం గొంతు నులమడమే

హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులు తప్పు

ప్రభుత్వాలపై న్యాయస్థానాల నిందలు సరికాదు

న్యాయవ్యవస్థపై ఓ నేతకున్న పట్టును విదేశీ స్కాలర్లూ గుర్తించారు

సాక్షి, అమరావతి : కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాయడం ఏమాత్రం తప్పు కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలహాబాద్‌ హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ దంతులూరి శ్రీనివాస రంగనాథవర్మ స్పష్టం చేశారు. ఇంట్లో వాళ్లు తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దకే ఫిర్యాదు చేస్తారు. ఇది తప్పు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తమపై ఫిర్యాదులు చేయడానికి వీల్లేదనేందుకు న్యాయమూర్తులేమీ చట్టాలకు అతీతులు కారన్నారు. రాష్ట్ర హైకోర్టుపై ఓ వ్యక్తికి ఉన్న పట్టు గురించి విదేశీ పరిశోధకులే తమ పరిశోధన పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారని, ఆ తరువాత ఈ విషయాన్ని రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు. ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమంటే అది గొంతు నొక్కేయడమేనన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

అలా అని ఎక్కడా లేదు..
ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని గానీ, లేఖ రాయకూడదని గానీ ఎక్కడా లేదు. రాయవచ్చు. దాన్ని బహిర్గతం చేయడం వల్ల తీవ్రత పెరిగింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గతంలో చాలా మంది రాశారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఆ ఫిర్యాదుపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రభుత్వాలు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఆయన ఎవరో అందరికీ తెలుసు..
2004–05లో ఇంగ్లాడ్‌లోని బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి భారతీయ న్యాయవ్యవస్థపై పరిశోధన చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టుకలిగి ఉన్నారని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. పరిశోధన పత్రంలో ఆ ముఖ్యమంత్రి పేరును కూడా ఉదహరించారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు. విదేశీ స్కాలర్స్‌ కూడా భారత న్యాయవ్యస్థ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి అప్పుడు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. నేను అప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నా. 

ఆ లేఖ.. వ్యక్తిగతం కాదు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ ముఖ్యమంత్రి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడంలో ఎంత మాత్రం తప్పు లేదు. రాజ్యాంగ వ్యవస్థల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా, అభ్యంతరం ఉన్నా చివరకు వెళ్లేది న్యాయవ్యవస్థ వద్దకే. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ధిష్టమైన అభ్యంతరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత హోదాలో ఫిర్యాదు చేయలేదు. అందులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేసినంత మాత్రాన అది ఆయన వ్యక్తిగత లేఖ కాదు. ప్రభుత్వం తరఫున ఆ ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యమంత్రికైనా, సాధారణ వ్యక్తికైనా ఫిర్యాదు చేసే అధికారం ఉంది. ఫిర్యాదు చేయకూడదనేందుకు న్యాయమూర్తులేవీ చట్టానికి అతీతులు కారు.

మంచి చెడులను ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం..
ఆ లేఖను బహిర్గతపరచడం మంచిదా? కాదా? అన్నది ఓ పెద్ద చర్చనీయాంశం. ఆ అంశంలో మంచి చెడులను ప్రజల విజ్ఞతకే వదిలేయాలి. గతంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, రంజన్‌ గొగోయ్, జోసెఫ్‌ మరొకరు కలిసి మీడియా ముందుకు వచ్చారు. రోస్టర్‌ విషయంలో ప్రధాన న్యాయమూర్తి సక్రమంగా ఉండటం లేదని, పారదర్శకతంగా వ్యవహరించడం లేదని, రోస్టర్‌ విషయంలో ప్రజాస్వామ్యం లేదని బహిరంగంగా తమ ఆవేదనను గొంతెత్తి చెప్పారు. దీన్ని కొందరు ఆమోదించారు. కొందరు విమర్శించారు. జడ్జిలు ఇలా మీడియా ముందుకు రావచ్చా? అని జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరిగింది. న్యాయవ్యవస్థ క్రమశిక్షణపై చర్చ జరిగింది. అంతిమంగా అది మంచిదా.. కాదా? అన్నది ప్రజలే ఆలోచించుకున్నారు.

ఆధారాలున్నప్పుడు ఫిర్యాదు చేయకూడదంటే ఎలా..?
ముఖ్యమంత్రి ఫిర్యాదుపై సుప్రీంకోర్టు సీజే అంతర్గత విచారణ జరుపుతారు. ఇందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ నిజానిజాలను తేలుస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలుంటాయి. అయితే ఇతర న్యాయమూర్తులపై చర్యలు తీసుకునే అధికారం సీజేఐకి లేదు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఆరోపణలు రుజువైతే సాధారణంగా బదిలీ చేస్తారు. లేదా రకరకాల కారణాలతో ఎలాంటి చర్యలు తీసుకుండానే వదిలేస్తారు. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎన్నో జరిగాయి. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు తప్పులు చేశారనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? అలా అనడం తప్పు. తమపై ఫిర్యాదు చేయరాదని చెప్పేందుకు న్యాయమూర్తులేమైనా చట్టాలకు అతీతులా? నిరాధార ఆరోపణలు చేయకూడదన్న సంగతి మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి. ఆధారాలున్నప్పుడు కూడా ఫిర్యాదు చేయకూడదంటే ఎలా?

బాధతోనే సీఎం స్పందించారు..
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై ప్రభుత్వాలు ఫిర్యాదు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ వెలుగులోకి రాలేదంతే. ఆ న్యాయమూర్తిపై ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవి. అనుభవించిన వారికే నొప్పి తెలుస్తుంది. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించరాదు. వ్యవస్థలను అభద్రతా భావంలోకి నెట్టడం న్యాయవ్యవస్థ పని కాదు. అలా అభద్రతా భావం కలిగించినప్పుడు, బాధతో ముఖ్యమంత్రి స్పందించారు. అందులో భాగంగానే సీజేఐకి లేఖ రాశారు. అందులో తప్పేమీ లేదు. ఆరోపణలు నిరూపితం అయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అభిశంసనకు సంబంధించి చట్టసభల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు నిర్దిష్ట విధానం ఉంది. గతంలో సుప్రీం సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రామస్వామిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఓటింగ్‌లో వీగిపోయింది. ఆ తరువాత ఆయన పలు కారణాలతో రాజీనామా చేశారు.

కోర్టు ధిక్కారమంటే.. ప్రభుత్వం గొంతునొక్కేయడమే
న్యాయమూర్తులేమీ చట్టానికి అతీతులు కారు. వారికీ పరిధులున్నాయి. అతీతులమన్న రీతిలో న్యాయవ్యవస్థ వ్యవహరించరాదు. కోర్టు ధిక్కార చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు వాడరాదు. అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులు, ప్రభుత్వాల గొంతు నొక్కేయడమే అవుతుంది. కోర్టు ధిక్కారం కింద క్షమాపణ చెప్పలేదని ప్రశాంత్‌ భూషణ్‌కు రూపాయి జరిమానా విధించారు. కోర్టు ధిక్కార చట్ట ప్రయోగం సమస్యకు పరిష్కారం కాదు. అసలు సమస్య ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఫిర్యాదు చేసింది? ఆరోపణలు నిజమైనవేనా? అన్న అంశంపై లోతుగా విచారణ జరపాలి. ఆరోపణలకు ఆస్కారం రాకుండా చూసుకోవాలి. ఈ దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. అంతే తప్ప ధిక్కార చర్యలు పరిష్కారం చూపవు. 

హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ చాలా తప్పు...
ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ చాలా తప్పు. అది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాత అధికారులు దర్యాప్తు పూర్తి చేయాలి. ఆ దర్యాప్తును ఆపడానికి వీల్లేదు. తార్కిక ముగింపునకు రావాలి. హైకోర్టు దర్యాప్తును ఆపేయడమే కాకుండా గ్యాగ్‌ ఉత్తర్వులిచ్చింది. మీడియా మీద ఆం«క్షలు విధించడం వల్ల మరింత ప్రాచుర్యం లభించింది. హైకోర్టు అలా చేసి ఉండాల్సింది కాదు. 

నియామకాల్లో పారదర్శకత ఉండాలి..
న్యాయవ్యవస్థలో చేపట్టే నియామకాలు చాలా వరకు రాజకీయ నియామకాలేనన్న ఆరోపణలున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత ఉండాలి. సరైన పద్దతి ఉండాలి. తగిన అభిప్రాయ సేకరణ జరగాలి. సమర్థతకు పట్టం కట్టాలి.

ప్రభుత్వాలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు సరికాదు...
న్యాయమూర్తుల బెంచ్‌ మీద నుంచి ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నది నా అభిప్రాయం. నేను జడ్జిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఓ ఘటన జరిగింది. ఓ బెంచ్‌లో ఇద్దరు న్యాయమూర్తులన్నారు. సీనియర్‌ న్యాయమూర్తి ఒకరు ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. ప్రభుత్వమే పెద్ద భూ కబ్జాదారని పేర్కొనటంపై పెద్ద రచ్చ జరిగింది. ఆ న్యాయమూర్తిపై సీజేకు సైతం ఫిర్యాదు వెళ్లింది. అయితే ఆ న్యాయమూర్తి తాను అలా అనలేదన్నారు. ఆయన పక్కన ఉన్న న్యాయమూర్తి మాత్రం ఆయన అలానే వ్యాఖ్యానించారని చెప్పారు. కొద్ది కాలానికి ఆ వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వమే భూ కబ్జాదారంటే ఎలా? అది ఎంత పెద్ద మాట? ఇలాంటి నిందలు ఎంత వరకు సమంజసం? కోర్టులు, న్యాయమూర్తులు ఇలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఇక సుప్రీంకోర్టు సీజేకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు? గత 10–15 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలపై న్యాయస్థానాలు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం, విమర్శించడం ఎక్కువైంది. ఇలాంటి వ్యాఖ్యలు, మాటలు మంచిది కాదన్నది నా అభిప్రాయం.

ఆ ఇద్దరి లేఖలు..  మక్కీకి మక్కీ
జస్టిస్‌ చలమేశ్వర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు బయట పెట్టిన ఓ సంచలనాత్మక అంశం పత్రికల పతాక శీర్షికల్లో వచ్చింది. ఓ న్యాయమూర్తికి, నాటి ప్రభుత్వాధినేతకు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఆయన బయటపెట్టారు. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి ఒకరు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి నాటి ప్రభుత్వాధినేత నుంచి కూడా సుప్రీంకోర్టుకు లేఖ వచ్చింది. రెండూ లేఖల్లోని సారాంశం ఒకటే. అందులోని వాక్యాలు, పదాలు దాదాపు ఒకటే. అంటే ఆ లేఖ ప్రభుత్వాధినేత నుంచి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వచ్చిందా? లేక సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి నుంచి ఆ ప్రభుత్వాధినేతకు వచ్చిందా? ఎవరి నుంచి ఎవరికి వెళ్లింది.? ఈ వ్యవహారాన్ని ఎలా భావించాలి. దీన్నే కదా జస్టిస్‌ చలమేశ్వర్‌ ప్రశ్నించారు. న్యాయమూర్తి ఎప్పుడూ తన అభిప్రాయాన్ని స్వతంత్రంగా రాయాలి. కానీ అటు ప్రభుత్వాధినేత, ఇటు సీనియర్‌ న్యాయమూర్తి లేఖలు మక్కీకి మక్కీగా ఉన్నాయి. దీన్ని ఎలా భావించాలి? అలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నాటి ప్రభుత్వాధినేత సన్నిహిత సంబంధాలు చాలా ప్రశ్నలు, సందేహాలను రేకెత్తించాయి. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నదే ప్రజల ఆకాంక్ష.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top