22ఏ నిషేధిత జాబితా నుంచి 51,603 ఎకరాల తొలగింపు | Removes 51603 Acres From 22 A Prohibited List: Andhra pradesh | Sakshi
Sakshi News home page

22ఏ నిషేధిత జాబితా నుంచి 51,603 ఎకరాల తొలగింపు

Mar 23 2026 5:46 AM | Updated on Mar 23 2026 5:46 AM

Removes 51603 Acres From 22 A Prohibited List: Andhra pradesh

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పారి­శ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఆధీనంలో ఉన్న 51,603.46 ఎకరాల ప్రభుత్వ, డీకేటీ, పట్టా భూములను రిజిస్ట్రేషన్‌ చట్టం–1908 సెక్షన్‌ 22–ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆ భూములను పూర్తిగా ఏపీఐఐసీ పేరు మీదకు మార్చడానికి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఐఐసీ స్వాధీనంలో 70,000 ఎకరాలు ఉన్నప్పటికీ, పరిహారం చెల్లించిన 51,603.46 ఎకరాలకు సంబంధించి ఇంకా రెవెన్యూ, వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో మ్యుటేషన్‌ జరగలేదని పేర్కొన్నారు.

దీనివల్ల వివిధ సంస్థలతో ఏపీఐఐసీ అమ్మకం ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతుందని, ఈ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి తక్షణమే ఏపీఐఐసీ పేరు మీదకు బదలాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. 22ఏ జాబితాలోఅత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 11,862.11 ఎకరాలు ఉండగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 10,403.92 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 4,172.18 ఎకరాల భూములు ఉన్నాయి. అతి తక్కువగా పొలవరం జిల్లాలో 19.61 ఎకరాలు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement