రాతి పనిముట్లకు తగ్గుతున్న ఆదరణ
శుభకార్యాలకే పరిమితమవుతున్న రోళ్లు, సన్నికల్లు, తిరగళ్లు
ఆధునికత మేళవింపుతో అక్కడక్కడా అమ్మకాలు
పిఠాపురం: ఒకప్పుడు ఏ ఇంట చూసినా రోలు, రోకలి, కల్వం, రుబ్బురోలు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లు అతివలకు వంటింటి నేస్తాలుగా ఉండేవి. వీటిని సాక్షాత్తూ దైవ స్వరూపాలుగా భావించేవారు. రోలు సాక్షాత్తూ శ్రీమహాలక్షి్మ.. రోకలి శ్రీమన్నారాయణుడు.. తిరగలి శివుడు.. దాని పిడి పార్వతీదేవి.. ఈ పవిత్ర భావనతోనే వాటికి పొరపాటున కూడా కాలు తగలకుండా జాగ్రత్త పడేవారు.
ఒకవేళ అలా కాలు తగిలితే మహాపాపంగా భావించేవారు. ప్రతి ఇంట్లో ఆయా రాతి పనిముట్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ, కాలక్రమంలో మిక్సీలు, గ్రైండర్ల వంటి ఆధునిక గృహోపకరణాలు వచ్చిన తరువాత నాటి ‘పాత రాతి యుగం’ ప్రాభవం క్రమంగా తగ్గుతోంది. అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ.. ఎక్కువగా వివాహాది శుభకార్యాల్లో.. అది కూడా పసుపు కొట్టడం వంటి కార్యక్రమాలకే పరిమితమవుతోంది.

ఆ రుచే వేరు
పండగలు సమీపిస్తున్నా, ఊరగాయల సీజన్ మొదలైనా.. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతున్నా.. గతంలో రోళ్లు, రోకళ్లు, తిరగళ్లు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లకు బోలెడంత పని. పప్పులను రోటిలో దంచేవారు. మసాలాలు కల్వంలో నూరేవారు. రుబ్బురోటిలో చేసే రోటి పచ్చడి అంటే ఇప్పటికీ చాలా మంది ‘ఆ రుచే వేరు’ అంటూ లొట్టలేస్తారు. అంతే కాదు.. వీటిల్లో ఎప్పటికప్పుడు తయారు చేసే పచ్చళ్లు, రకరకాల పొడులు తాజాగా ఉంటాయి.
అంతా రెడీమేడ్
పాత కాలం నాటి రాతి పనిముట్లు వాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆధునిక జీవితంలో వేగం పెరిగింది. బతుకుతెరువు కోసం కాలంతో పోటీ పడాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసం మిక్సీలు, గ్రైండర్ల వంటి రకరకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పాత రాతి పనిముట్ల స్థానాన్ని ఆక్రమించాయి.
గతంలో పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవడం, కారం, పసుపు కొట్టడం, అరిసెల పిండి దంచడం వంటి పనులను పది మంది కలసి చేసేవారు. ఇప్పుడన్నింటికీ యంత్రాలే. పైగా, అన్నీ షాపులో రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరకు ఊరగాయలు, కూరలు కూడా రెడీమేడ్. అయితే, వీటిలో ఏ కల్తీలు జరుగుతున్నాయో.. మన ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తున్నాయో గమనించే పరిస్థితి కూడా ఉండటం లేదు.
ఆరోగ్యానికి మేలు
గతంలో రోలు, రోకలి, తిరగలి, రుబ్బురోలు వంటి లేకుండా మనిషి ఆహార అవసరాలు తీరేవి కావు. పొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు కొట్టుకోవడం వంటివన్నీ నిత్య కృత్యాలు. విసరడం, దంచడం, నూరడం వెనుక శారీరక శ్రమ ఉంటుంది. కాబట్టి, వీటిని ఉపయోగించే వారికి మోకాలు, నడుము, భుజాలు, మెడ వంటి నొప్పులు ఉండేవి కావని అంటారు. అలాగే, రక్తపోటు (బీపీ), డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలు కూడా చాలా అరుదుగా వచ్చేవి.
ఆయా పనిముట్లు ఉపయోగించే వారిలో చేతులు, కాళ్ల మీద కాకుండా పొట్ట మీద ఒత్తిడి పడుతుంది. దీనివలన గర్భిణులకు సుఖప్రసవం జరుగుతుందని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని పాతతరం వారు నమ్ముతారు. రాతి రోళ్లు, తిరగలి వాడకం వల్ల స్త్రీలు 43 సంవత్సరాల తర్వాత వచ్చే మెనోపాజ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే, అధిక బరువుతో బాధ పడేవారికి, కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
ఆధునిక రూపంలో..
రోళ్లు, రోకళ్లు, తిరగలి ఎంత పెద్దగా ఉన్నా గతంలో చాలా సులభంగా ఉపయోగించేవారు. తిరగలి పై భాగాన్ని సులువుగా లేపేవారు. మరీ పెద్దదైతే ఇద్దరు కలిసి లేపేవారు. రుబ్బురోలు పొత్రాన్ని సులభంగా ఎత్తేవారు. ఇప్పుడు ఎవ్వరికీ రోటిలో దంచే తీరికా లేదు.. పొత్రం ఎత్తే ఓపికా లేదు. అయితే, ఈ పనిముట్లపై ఇప్పటికీ కొంత మందికి మోజు ఉంది. వారిని దృష్టిలో పెట్టుకుని వీటి తయారీదారులు ఇప్పటి అవసరాలకు తగినట్లుగా రాతి రోళ్ల తయారీలో స్మార్ట్ టెక్నిక్స్ వాడుతున్నారు. మార్బుల్, గ్రానైట్‌తో పాటు సోప్ స్టోన్స్, శాండ్ స్టోన్లతో తక్కువ బరువుతో ఈ పనిముట్లు తయారు చేస్తున్నారు.
రుబ్బుతున్నప్పుడు, విసురుతున్నప్పుడు పిండి సులువుగా తీసుకునేందుకు అనుకూలంగా ట్రేలు ఏర్పాటు చేస్తున్నారు. తిరగలిలో పైన పప్పులు పోసేందుకు చెక్కతో మూతలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. సన్నికల్లును సన్నగా కత్తిరిస్తున్నారు. రుబ్బురోలుకు స్టెయిన్‌లెస్ స్టీల్ హ్యాండిల్స్ పెడుతున్నారు. ఆధునిక కిచెన్లకు సంప్రదాయ పనిముట్లను జోడించేలా వీటిని తయారు చేస్తున్నారు.
పెళ్లిళ్లలోనే ప్రాధాన్యం
వివిధ ప్రాంతాలు, సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వేడుకల్లో రాతి రోళ్లకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. ప్రతి శుభకార్యానికీ పసుపు కొట్టడం ఆనవాయితీ. వీటితో ధాన్యం దంచడం, కొటా్నలు వంటి సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది తమ ఇళ్లల్లో చాన్నాళ్లుగా పక్కన పెట్టేసిన వీటిని శుభకార్యాల్లో మాత్రం తప్పనిసరిగా బయటకు తీస్తారు.
కొందరైతే రెడీమేడ్ పనిముట్లతో శుభకార్యాలు పూర్తి చేస్తున్నారు. పెళ్లితంతులను బట్టి వీటికి ప్రాధాన్యం పెరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబాల్లో అయితే తాళి»ొట్టును రోకలికి, కాడికి కట్టి, పాలు పోస్తూం చేసే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. – వెలిది రమేష్ శర్మ, పురోహితుడు, కొత్తపల్లి, కాకినాడ జిల్లా


