
తెనాలి: విజయవాడకు చెందిన బహుభాషా కోవిదుడు వెంకట్ పూలబాల రచన ‘భారతవర్ష’కు అరుదైన గౌరవం లభించింది. తెలుగు వారి సంప్రదాయ, సాంస్కృతిక అంశాలతో గద్య పద్య కావ్యంగా 1,265 పేజీల్లో వెలువడిన ఆధ్యాత్మిక శృంగార కావ్యం భారతవర్ష. అమెరికాలోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఈ నెల 16న వెబినార్‌లో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించనుంది. డబ్బు కన్నా విలువైనవి మానవ సంబంధాలని, గుణగుణాలు ప్రగతికి సోపానాలనే మరపురాని ఇతివృత్తంతో, మనసుకు హాయి గొలిపే భాషతో, ఉదాత్తమైన పాత్రలతో మనోరంజకంగా మలచిన కావ్యం.
తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి అభినందనలు అందుకున్న భారతవర్ష, విడుదల కాకుండానే గిన్నిస్‌బుక్ పరిశీలనలో ఉండటం మరో విశేషం. వెయ్యి పేజీలు మించిన నవల రచనకు మిట్చెల్ అనే ఇంగ్లిష్ రచయిత్రికి పదేళ్లు పట్టింది. ‘జూరాసిక్ పార్క్’ రచనకు క్రోక్టర్ అనే అమెరికన్ రచయిత అంతే సమయం తీసుకున్నారు. ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యుగోల్‌కు ‘మిజరబుల్’ అనే నవలకు పన్నెండేళ్లు పట్టింది. పూలబాల తన వృత్తపద్యాలతో గ్రాంధిక తెలుగులో భారతవర్ష గ్రంథాన్ని కేవలం ఎనిమిది నెలల్లోనే
రచించారు.
తెలుగులో తొలి ఫ్రెంచి నవల
తెలుగులో తొలి ఫ్రెంచి నవల రాసిన రచయితగా గుర్తింపు పొందిన పూలబాల బహుభాషాకోవిదుడు. ఆరు విదేశీ భాషలు తెలిసిన పూలబాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెంటర్‌లో బోధించారు. పేజీ మేకర్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ వర్డ్‌పై గ్రంథాన్ని నేరుగా కంపోజ్ చేయటం, ట్రాన్స్‌లిటరేషన్ ద్వారా 1,265 పేజీలు తెలుగు నవల టైపు చేయడమనే అంశాలు గిన్నిస్ బుక్ పరిశీలనలో ఉన్నాయి.