అవినీతికి కేరాఫ్‌ డీఎల్‌ రవీంద్రారెడ్డి.. సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలను డైవర్ట్‌ చేసే యత్నం

Raghurami Reddy Fires On DL Ravindra Reddy corruption - Sakshi

కడప కార్పొరేషన్‌: మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఆయనకు నెలకు రూ.50 లక్షల బాడుగలు వచ్చే ఆస్తులున్నాయని చెప్పారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఆస్తి, ఇప్పుడున్న ఆస్తి ఎంత అని నిలదీశారు. గురువారం ఇక్కడ మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంవైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా బుధవారం రాష్ట్రమంతా వేడుకలు, సేవా కార్యక్రమాలు జరిగాయని, ఈ సంతోషం నుంచి రాష్ట్ర ప్రజలను డైవర్ట్‌ చేయాలనే కుట్రతోనే డీఎల్‌ వైఎస్సార్‌సీపీ పైన, వైఎస్‌ జగన్‌ పైన విమర్శలు చేశారని చెప్పారు.

రామోజీరావు, రాధాకృష్ణల ఎత్తుగడలో భాగంగానే డీఎల్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారన్నారు. డీఎల్‌కు నైతిక విలువల్లేవని, నిజాయితీగా ఏ పార్టీకీ పనిచేయలేదని అన్నారు. ఆయన జీవితమంతా అక్రమాలేనని చెప్పారు. రెండుసార్లు మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయ్యారని చెప్పారు. కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కల్తీ మద్యం అమ్మి 20 మంది చనిపోవడానికి కారణమయ్యారని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయ్యారని తెలిపారు. డీఎల్‌ గురించి తెలిసే వైఎస్‌ మంత్రిపదవి ఇవ్వలేదన్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 108 ఒప్పందంలో అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో ఆయన విదేశాల్లో ఉండగానే బర్తరఫ్‌ చేశారని తెలిపారు. 2014లో కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీ అభ్యర్థికి పనిచేశారని, ఆయన సతీమణి సుభద్రమ్మను టీడీపీ ఏజెంట్‌గా కూర్చొబెట్టారని తెలిపారు. 2019కి ముందు వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని గుర్తించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే తమ పార్టీలోకి వచ్చారన్నారు. అయితే టీడీపీకి ఓటెయ్యాలని చెప్పి తనకు, పార్టీకి తీరని ద్రోహం చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అని నిలదీశారు. ఆయనకు అసలు వైఎస్సార్‌సీపీ సభ్యత్వమే ఇవ్వలేదని చెప్పారు. 

డీఎల్‌ నీచ చరిత్ర అందరికి తెలిసిందే: మేయర్‌ సురేష్‌బాబు 
డీఎల్‌ రవీంద్రారెడ్డి నీచ చరిత్ర వైఎస్సార్‌ జిల్లాలో చంటిపిల్లాడికి కూడా తెలుసని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్‌ కె. సురేష్‌ బాబు అన్నారు. డీఎల్‌ ఓ పొలిటికల్‌ బ్రోకర్‌ అని,  ఆయన జీవితమంతా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలేనని తెలిపారు. పేద విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటే దానిపైనా విమర్శలు చేయడం దారుణమన్నారు. డీఎల్‌కు ఏ పార్టీ టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌లో ఏం నిజాయితీ కనిపించిందో డీఎల్‌ చెప్పాలని అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top